సింగపూర్ : తెలుగు భాష, సంస్కృతి పరిరక్షణకు ప్రపంచవ్యాప్తంగా సమష్టి కృషి అవసరమని హాంకాంగ్ తెలుగు సమాఖ్య అధ్యక్షురాలు జయ పీసపాటి (Jaya Peesapati) అన్నారు. సింగపూర్‌లో పర్యటిస్తున్న ఆమె అక్కడి తెలుగు వారిని కలిసి, ముచ్చటించారు. జయ పీసపాటి రాకను పునస్కరించుకొని శ్రీ సాంస్కృతిక కళాసారథి ఆధ్వర్యంలో ఆదివారం ఆత్మీయ సమ్మేళనం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాన్ని భావితరాలకు అందించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె పిలుపునిచ్చారు.
సరిగమ గ్రాండ్ రెస్టారెంట్లో సుమారు 25 మంది తెలుగు ప్రముఖులు, సాహితీ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమం ఆత్మీయ వాతావరణంలో సాగింది. సుబ్బు వి. పాలకుర్తి నిర్వహణలో జరిగిన ఈ కార్యక్రమానికి జయ పీసపాటి తమ కుటుంబ సభ్యులతో కలిసి హాజరై, సింగపూర్‌లోని తెలుగు ప్రముఖులతో ఆత్మీయంగా ముచ్చటించారు. ఈ సందర్భంగా జయ పీసపాటి మాట్లాడుతూ.. హాంకాంగ్ తెలుగు సమాఖ్య ఆవిర్భావానికి ముందు జరిగిన పరిణామాలతో పాటు గత 22 సంవత్సరాలుగా సమాఖ్య ద్వారా తెలుగువారికి అందిస్తున్న సేవలను వివరించారు. తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాన్ని భావితరాలకు అందించడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతను నిర్వర్తించాలని ఆమె పిలుపునిచ్చారు.

మీడియా సహా వివిధ రంగాల్లో మహిళలు మరింత చురుకైన పాత్ర పోషించడం ద్వారా సమాజంలోని మరెందరికో స్ఫూర్తిగా నిలుస్తారని జయ పీసపాటి పేర్కొన్నారు. ప్రతి ఇంట్లో పిల్లలకు తెలుగు నేర్పించడం ద్వారా వారికి భాషపై అభిమానం పెంపొందించడంతో పాటు, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా తెలుగువారిగా ప్రత్యేక గుర్తింపు లభిస్తుందని ఆమె అన్నారు.
ఆదివారం వంటి వారాంతపు రోజున కూడా ఇంతమంది తెలుగువారు ఒకచోట చేరి కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో ఆనందంగా ఉందని జయ పీసపాటి పేర్కొన్నారు. సింగపూర్, హాంకాంగ్ తెలుగు సంస్థల మధ్య ఉన్న సత్సంబంధాలు భవిష్యత్తులో మరింత బలోపేతం కావాలని జయ పీసపాటి ఆకాంక్షించారు.
హాంకాంగ్‌లో తెలుగు సమాఖ్యను నిర్వహిస్తున్న జయ పీసపాటికి సింగపూర్‌తో ప్రత్యేక అనుబంధముంది. విదేశాల్లో నిర్వహించే తెలుగు కార్యక్రమాల్లో తొలిసారిగా పాల్గొనే అవకాశం తనకు 2016లో సింగపూర్‌లో జరిగిన 5వ ప్రపంచ సాహితీ సదస్సు ద్వారా లభించిందని జయ పీసపాటి గుర్తు చేసుకున్నారు. ఆ సందర్భంగా సింగపూర్‌లోని తెలుగువారి ఐక్యత, చురుకుదనం తనకు ఎంతో ప్రేరణనిచ్చాయని ఆమె నాటి జ్ఞాపకాలను పంచుకున్నారు.

ఇటీవల మలేషియా తెలుగు సంఘం నిర్వహించిన 70వ వార్షికోత్సవ వేడుకలు ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు సంస్థలకు ఒక మార్గదర్శకంగా, బెంచ్‌మార్క్‌గా నిలిచాయని ఆమె అభినందించారు. ముఖ్యంగా నేటితరం పిల్లలు ఎంతో చక్కగా తెలుగు మాట్లాడటంతో పాటు పద్యాలు, గద్యాలను స్పష్టంగా చదివి వినిపించడం తనను ఎంతగానో ఆకట్టుకుందని అన్నారు. మలేషియా తెలుగు సమాజం చూపించిన స్ఫూర్తిని ఆదర్శంగా తీసుకుని, ప్రపంచంలోని వివిధ దేశాల్లో తెలుగు భాష మరింతగా అభివృద్ధి చెంది, భావితరాల్లో సజీవంగా కొనసాగాలని జయ పీసపాటి ఆకాంక్షించారు.

ఈ సందర్భంగా రత్న కుమార్ మాట్లాడుతూ.. జయ పీసపాటితో తనకున్న సుదీర్ఘ అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. 2016లో తొలిసారి పరిచయం.. అనంతరం జూమ్ వేదికగా నిర్వహించిన అనేక కార్యక్రమాల ద్వారా హాంకాంగ్ తెలుగు సమాఖ్యతో తమ అనుబంధం మరింత బలపడిందని ఆయన తెలిపారు. “జయ పీసపాటి ఇప్పుడు మా అందరికీ ఆత్మీయమైన ‘జయక్క’గా మారిపోయారు. ఏ కార్యక్రమం చేపట్టినా ఆమె సలహాలు, సూచనలు తీసుకోవడం మాకు ఎంతో సహజంగా మారింది. ఆమె ప్రసంగాలు, హాంకాంగ్ తెలుగు సమాఖ్య నిర్వహిస్తున్న కార్యక్రమాలు మాకు ఎన్నో సందర్భాల్లో స్ఫూర్తినిచ్చాయి” అని రత్న కుమార్ పేర్కొన్నారు.
తెలుగు భాషాభిమానం, ఆత్మీయత, సాంస్కృతిక అనుబంధాన్ని ప్రతిబింబించిన ఈ సమ్మేళనం ఆనందోత్సాహాల మధ్య ముగిసింది. సరిగమ గ్రాండ్ రెస్టారెంట్ యాజమాన్యం అతిథుల కోసం అల్పాహారాన్ని ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమంలో శ్రీ సాంస్కృతిక కళాసారథి సభ్యులు రాము చామిరాజు, భాస్కర్ వూలపల్లితో పాటు సింగపూర్ తెలుగు ప్రముఖులు సుదర్శన్ పూల, కొనాలి కాళికృష్ణ, సత్య జాస్తి, యోగి బూరుగుపల్లి, రాఘవాచార్యులు తట్టా, రాధాకృష్ణ గణేశ్న, కాత్యాయని, విద్యాధరి, రేణుక, శ్రీలలిత, పద్మావతి, సునీత, మాధవి తదితరులు పాల్గొన్నారు.