న్యూఢిల్లీ: ఒకవైపు తీవ్ర ఆంక్షలు విధించినా.. నిన్న మొన్నటి వరకు రష్యా చమురు దిగుమతిని ఎట్టి పరిస్థితుల్లో కొనసాగిస్తామని గట్టిగా ప్రకటించిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు వెనకడుగు వేసింది. ట్రంప్ బెదిరింపుల నేపథ్యంలో దిగుమతుల తగ్గింపునకు తల ఊపింది. ఉక్రెయిన్‌పై యుద్ధాన్ని ఆపడానికి రష్యాలోని రెండు ప్రధాన చమురు కంపెనీలపై అమెరికా ఆంక్షలు విధించిన క్రమంలో రష్యా చమురు దిగుమతులను గణనీయంగా తగ్గించడానికి భారత చమురు శుద్ధి కర్మాగారాలు సిద్ధంగా ఉన్నాయని పరిశ్రమ వర్గాలు గురువారం తెలిపాయి.
సముద్ర ఆధారిత చమురును రాయితీపై రష్యా నుంచి కొనుగోలు చేస్తూ భారత్ పెద్ద దిగుమతిదారుగా మారింది. 2022లో ఉక్రెయిన్‌పై రష్యా సైనికచర్య జరిపినప్పటి నుంచి చవక చమురును రష్యా నుంచి కొనడం ప్రారంభించిన మన దేశం గత తొమ్మిది నెలలుగా రోజుకు 1.7 మిలియన్ బ్యారెళ్ల చమురును కొనుగోలు చేస్తున్నది. అలా కొనుగోలు చేయడం అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌కు కంటగింపుగా మారి, ప్రతీకారంగా భారత్ దిగుమతులపై 50 శాతం సుంకాలు విధించారు.
రష్యా నుంచి అతి పెద్ద చమురు కొనుగోలుదారుగా ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్ తన దిగుమతులను తగ్గించుకోవడమో, లేదా పూర్తిగా నిలిపివేయడమో చేయాలని నిర్ణయించినట్టు పరిశ్రమ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం రిలయన్స్, రష్యాకు చెందిన రోస్నెఫ్ట్ నుంచి రోజుకు 5 లక్షల బ్యారెళ్ల ముడి చమురును దిగుమతి చేసుకోవడానికి దీర్ఘకాల ఒప్పందం చేసుకుంది. దీనిపై రిలయన్స్ ప్రతినిధిని ఒకరిని వివరణ అడుగగా, ‘రష్యన్ చమురు దిగుమతుల పునః పరిశీలన కొనసాగుతున్నది.
ఈ విషయంలో రిలయన్స్ భారత ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా వ్యవహరిస్తుంది’ అని స్పష్టం చేశారు. దీనిపై భారత చమరు మంత్రిత్వ శాఖ స్పందించ లేదు. ఇలా ఉండగా, అమెరికా ఆంక్షలు విధించిన రోస్నెఫ్ట్, లుక్ఆయిల్ సంస్థల నుంచి భారత ప్రభుత్వ సంస్థలు నేరుగా ఎలాంటి చమురును దిగుమతి చేసుకోవడం లేదని సంబంధిత పరిశ్రమ వర్గాల అధికారులు తెలిపారు. భారత చమురు శుద్ధి సంస్థలైన ఐఓసీ, బీపీసీ, హెచ్‌పీ, మంగళూరు రిఫైనరీ కూడా ఈ రెండు సంస్థల నుంచి కొనుగోళ్లు జరపవని, మధ్యవర్తి సంస్థల ద్వారా దిగుమతులు సాగుతాయని వారు చెప్పారు.