ఇస్లామాబాద్, ఏప్రిల్ 24: జమ్ము కశ్మీరులోని పహల్గాంలో పర్యాటకులపై ఉగ్రవాదుల పాశవిక దాడికి ప్రతిచర్యగా భారత్ పాకిస్థాన్‌పై దౌత్యపరమైన చర్యలను ప్రకటించిన మరుసటి రోజు పాకిస్థాన్ కూడా భారత్‌పై ప్రతీకార చర్యలను ప్రకటించింది. వాఘా సరిహద్దును మూసివేయడంతోపాటు భారత జాతీయులకు సార్క్ వీసాలను రద్దు చేయడం, భారతీయ ఎయిర్‌లైన్స్‌కు తన గగనతలాన్ని మూసివేయడం వంటి వరుస చర్యలను పాక్ ప్రకటించింది. సిమ్లా ఒప్పందాన్ని నిలిపివేస్తున్నట్లు ప్రకటించిన పాక్.. కశ్మీరుపై అంతర్జాతీయ చట్టాలకు, ఐక్యరాజ్యసమితి తీర్మానాలకు భారత్ కట్టుబడతామని ప్రకటించేంత వరకు ఆ దేశంతో అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది.
భారత్ దౌత్యచర్యలకు ప్రతీకారంగా పాకిస్థాన్ గురువారం పలు కీలక చర్యలు చేపట్టింది. తక్షణమే వాఘా సరిహద్దును మూసివేస్తున్నట్లు వెల్లడించింది. ఈ మార్గంలో భారత్ నుంచి జరిగే రవాణాను సస్పెండ్ చేసింది. చట్టబద్ధమైన పత్రాలతో వాఘా ద్వారా పాకిస్థాన్‌లోకి ప్రవేశించిన భారతీయులందరూ ఏప్రిల్ 30 లోగా స్వదేశానికి వెళ్లిపోవాలని పాక్ ఆదేశించింది. సిమ్లా ఒప్పందంతో సహా అన్ని ద్వైపాక్షిక ఒప్పందాలను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించింది.
సార్క్ వీసా మినహాయింపు పథకం(ఎస్‌వీఈఎస్) కింద భారతీయులకు జారీచేసిన వీసాలను రద్దు చేస్తున్నట్లు ప్రకటించిన పాక్.. ఇది తక్షణమే అమలులోకి వస్తుందని తెలిపింది. ఈ పథకం కింద పాక్‌లో ప్రస్తుతం ఉంటున్న భారతీయులందరూ 48 గంటల్లో దేశం విడిచిపోవాలని ఆదేశించింది. భారతీయ ఎయిర్‌లైన్స్‌కు తమ గగనతలాన్ని మూసివేస్తున్నట్లు తెలిపింది. తృతీయ దేశాల ద్వారా జరిగే వాణిజ్యంసహా భారత్‌తో అన్ని రకాల వాణిజ్యాన్ని నిలిపివేస్తున్నట్లు తెలిపింది.
ఇస్లామాబాద్‌లోని భారతీయ రక్షణ, నౌకాదళ, వైమానిక సలహాదారులు ఏప్రిల్ 30 లోగా తమ దేశాన్ని వీడాలని ఆదేశించింది. హై కమిషన్‌లో వారి పదవులను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నెలాఖరుకల్లా ఇస్లామాబాద్‌లోని భారతీయ హైకమిషన్‌లోని సిబ్బంది సంఖ్యను 30కి తగ్గించినట్లు తెలిపింది. పాకిస్థాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ అధ్యక్షతన సమావేశమైన జాతీయ భద్రతా కమిటీ సమావేశం అనంతరం జారీచేసిన ప్రకటనలో భారత్ తమకు వ్యతిరేకంగా తీసుకున్న నిర్ణయాలను ఏకపక్షం, అన్యాయం, రాజకీయ దురుద్దేశంతో తీసుకున్నవిగా పాక్ ప్రభుత్వం అభివర్ణించింది. వీటికి చట్టపరమైన అర్హత లేదని పేర్కొంది.