Pak Deputy PM | పెహల్గామ్ ఉగ్రదాడితో దాయాది దేశం పాకిస్థాన్ (Pakistan) అసలు రంగు మరోసారి బయటపడింది. ఈ దాడితో తమకు సంబంధం లేదని తెలిపిన పాక్.. దాడికి పాల్పడిన ఉగ్రవాదులను మాత్రం స్వాతంత్య్ర సమరయోధుల (freedom fighters)తో పోల్చింది.
మంగళవారం మధ్యాహ్నం జమ్ము కశ్మీర్‌లోని ప్రముఖ పర్యాటక ప్రాంతం పెహల్గామ్లో మినీ స్విట్జర్లాండ్‌గా పేరొందిన బైసరాన్లో పర్యాటకులే లక్ష్యంగా ముష్కరులు విచక్షణా రహితంగా కాల్పులు జరిపారు. ఈ దాడిలో 26 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు. ఉగ్రదాడిని భారత్ తీవ్రంగా ఖండించింది. ఈ దాడికి త్వరలోనే ప్రతీకారం తీర్చుకుంటామని హెచ్చరించింది. ఇక ఈ దాడిని ప్రపంచ దేశాలు సైతం తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ విషయంలో భారత్ ఏ చర్య తీసుకున్నా మద్దతిస్తామంటూ ప్రపంచ నాయకులు ముందుకొచ్చారు. ఈ క్రమంలో ఉగ్రదాడిపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి, ఉప ప్రధాని (Pak Deputy PM) ఇషాక్ దార్ (Ishaq Dar) చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి.
పెహల్గామ్ దాడికి పాల్పడిన ఉగ్రవాదుల్ని ‘స్వాతంత్య్ర సమరయోధులు’గా ఆయన అభివర్ణించారు. ఇస్లామాబాద్‌లో నిర్వహించిన అధికారిక మీడియా సమావేశంలో ఇషాక్ దార్ మాట్లాడుతూ ‘ఏప్రిల్ 22న జమ్ము కశ్మీర్‌లోని పెహల్గామ్ జిల్లాలో దాడులు చేసిన ఉగ్రవాదులు స్వాతంత్య్ర సమరయోధులై ఉండొచ్చు’ అని వ్యాఖ్యానించారు. ఆయన వ్యాఖ్యలతో పాక్ వక్రబుద్ధి ప్రపంచదేశాల ముందు మరోసారి తేట తెల్లమైనట్లైంది. మరోవైపు సింధూ జలాల ఒప్పందాన్ని నిలిపివేస్తూ భారత్ తీసుకున్న నిర్ణయంపై కూడా ఆయన స్పందించారు. ఏకపక్ష నిర్ణయాన్ని తాము ఎన్నటికీ అంగీకరించబోమన్నారు. దీనికి ప్రతిచర్య తప్పదంటూ రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు.
Also Read..
Pahalgam Attack | ఉగ్రవాదుల కోసం వేట.. పారామిలిటరీ బలగాలకు సెలవులు రద్దు
Bandipora | బందిపొరాలో ఎన్కౌంటర్.. లష్కరే తోయిబా టాప్ కమాండర్ హతం
Pak opens Firing | పాక్ కవ్వింపు చర్య.. సరిహద్దుల్లో భారత్ సైన్యంపైకి కాల్పులు