Oil Prices : ఇరాన్ యుద్ధ సంక్షోభం ప్రపంచంలోని అనేక దేశాల్ని తీవ్రంగా ఇబ్బంది పెడుతోంది. యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా చమురు ధరలు భారీగా పెరుగుతున్నాయి. ఇటీవల కొద్దిగా తగ్గినట్లు కనిపించినా ఇప్పుడు మళ్లీ ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. బ్యారెల్ క్రూడాయిల్ 4 శాతం అంటే 4 డాలర్లు పెరిగి ధర 103.94 డాలర్లకు చేరింది. ఇటీవల 10 శాతం వరకు తగ్గిన చమురు ధరలు ఇప్పుడు మళ్లీ పెరుగుతున్నాయి.
దీనికి కారణం తాజాగా అమెరికా, ఇజ్రాయెల్-ఇరాన్ మధ్య నెలకొన్న సంక్షోభమే. ఐదు రోజులపాటు ఇరాన్‌పై దాడులు ఆపేస్తామని, ఆ దేశంతో చర్చలు జరుపుతామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ ప్రతిపాదనను ఇరాన్ తిరస్కరించింది. అమెరికా ప్రతిపాదనను తిరస్కరించినట్లు వెల్లడించిన ఇరాన్.. ఇదంతా మార్కెట్లపై ప్రభావం చూపేందుకు అమెరికా వేసిన ఎత్తుగడగా ఇరాన్ వర్ణించింది. ఇదే సమయంలో ఇరాన్‌పై ఇజ్రాయెల్ దాడులు కొనసాగుతున్నాయి. అలాగే, ఇరాన్ కూడా ఇజ్రాయెల్‌పై దాడి చేస్తోంది. పశ్చిమాసియాలో ఈ సంక్షోభం ఇంకా కొనసాగే అవకాశం ఉండటంతో చమురు ధరలు మరింత పెరుగుతున్నాయి. అమెరికా ఆస్తులే లక్ష్యంగా దాడి చేస్తామని ఇరాన్‌కు చెందిన ఐఆర్జీసీ ప్రకటించింది. చమురు సంక్షోభం తొలగాలంటే ఇరాన్ యుద్ధం ముగియాలి. అలాగే, హార్ముజ్ జలసంధి తెరవాలి. ప్రపంచంలో ఐదో వంతు చమురు ఈ మార్గం ద్వారానే రవాణా అవుతుంది.
అయితే, యుద్ధం కారణంగా ఈ రవాణా మార్గాన్ని ఇరాన్ మూసేసింది. దీంతో చమురు నౌకలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఫలితంగా సరఫరా నిలిచిపోవడంతో అనేక దేశాలు చమురు సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. హార్ముజ్ జలసంధి ఎప్పుడు అందుబాటులోకి వస్తుందో స్పష్టత లేదు. నిజానికి ట్రంప్ యుద్ధానికి విరామం ఇస్తున్నట్లు ప్రకటించడంతో చమురు ధరలు దిగొస్తాయని మార్కెట్ నిపుణులు భావించారు. కానీ, దీనికి ఇరాన్ భిన్నంగా స్పందించడంతో చమురు ధరలు ఇంకా పెరుగుతున్నాయి.