North Korea | ఉత్తర కొరియా (North Korea) – దక్షిణ కొరియా (South Korea) దేశాల మధ్య దూరం మరింత పెరగనుంది. దక్షిణ కొరియాతో సరిహద్దును శాశ్వతంగా మూసేయనున్నట్లు ఇటీవలే ఉత్తర కొరియా ప్రకటించిన విషయం తెలిసిందే. తాజాగా ఆ దిశగా చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగానే దక్షిణ కొరియాతో అనుసంధానించే రోడ్లు, రైల్వే మార్గాలను ఉత్తర కొరియా సోమవారం ఉదయం ధ్వంసం చేసే (Blow Up Cross Border Roads) అవకాశం ఉందని సియోల్ (Seoul) సైన్యం తాజాగా వెల్లడించింది. ఉత్తర కొరియా సైనికులు పశ్చిమ, తూర్పు తీరాలకు సమీపంలో ఉన్న సరిహద్దుల రోడ్లను ధ్వసం చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపింది.
సరిహద్దును శాశ్వతంగా మూసేస్తాం : ఉత్తర కొరియా అధ్యక్షుడు
దక్షిణ కొరియాతో తమకున్న సియోల్ సరిహద్దును పూర్తిగా మూసివేసేందుకు నిర్ణయించామని, ఆ దిశగా చర్యలు కొనసాగుతున్నాయని ఉత్తర కొరియా సైన్యం నాలుగు రోజుల క్రితం వెల్లడించిన విషయం తెలిసిందే. అకస్మాత్తుగా సంఘర్షణ తలెత్తకుండా యూఎస్ మిలిటరీకి ముందే సమాచారం ఇచ్చామని పేర్కొంది. రెండు కొరియాల మధ్య ఉన్న రోడ్లు, రైల్వే మార్గాలను మూసేస్తున్నట్లు ప్యోగ్యాంగ్ ఓ ప్రకటలో పేర్కొంది. ఈ చర్యను ‘ప్రధాన సైనిక చర్య’గా నార్త్ కొరియా అభివర్ణిస్తోంది.
1991లో ఉత్తర-దక్షిణకొరియా దేశాల మధ్య జరిగిన ఓ కీలక ఒప్పందాన్ని కిమ్ రాజ్యం రద్దు చేసుకోవాలని భావిస్తోంది. అంతేకాక దక్షిణ కొరియాను తమ శత్రుదేశంగా ప్రకటించాలని నిర్ణయించింది. పార్లమెంటరీ సమావేశాల్లో ఈ విషయాలన్నీ అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. కానీ, సమావేశాలు మంగళవారంతో ముగిసినప్పటికీ దీనిపై ఎలాంటి సమాచారం లేదు. ఉత్తర కొరియా ఎలాంటి నిర్ణయం తీసుకుందనే విషయంపై స్పష్టత లేదు.
ఈ క్రమంలోనే దక్షిణ కొరియాతో సరిహద్దును పూర్తిగా మూసేసేందుకు ఉత్తరకొరియా సన్నాహాలు చేస్తోందని ఆ దేశ సైన్యం తాజాగా వెల్లడించింది. రోడ్డు, రైలు మార్గాలను నిలిపివేసి బలమైన రక్షణ నిర్మాణాలతో తమ ప్రాంతాలను మరింత పటిష్టం చేసుకోనున్నట్లు తెలిపింది. ఈ ఏడాది జూన్‌లో సరిహద్దును పటిష్టం చేసే పనిలో ఉన్న ఉత్తర కొరియా సైనికులు కొందరు పేలుళ్ల కారణంగా మరణించారు.
అదే నెలలో రెండు కొరియాలను కలిపే రైల్వే లైన్లలోని భాగాలను ఉత్తర కొరియా కూల్చివేస్తోందన్న సంకేతాలను గుర్తించినట్లు సియోల్ గూఢచారి సంస్థ తెలిపింది. తమ శత్రు దేశంతో ఉన్న సరిహద్దును పూర్తిగా మూసేసి.. రాకపోకలను నివారించేందుకు ఉత్తర కొరియా చర్యలు చేపడుతున్నట్లు తెలుస్తున్నది.
ఉత్తర కొరియా చెత్త దాడి..
ఇక ఇప్పటికే ఈ రెండు దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. దక్షిణ కొరియా (South Korea)పై ఉత్తర కొరియా వరుసగా ‘చెత్త’ దాడికి పాల్పడుతున్న విషయం తెలిసిందే. పెద్దఎత్తున చెత్త, ఇతర విసర్జకాలతో ఉన్న మూటలతో కూడిన బెలూన్లను (Trash balloons) సరిహద్దు వెంబడి ఎగురవేసి దక్షిణ కొరియా గనగతలంలోకి పంపుతోంది. జూన్ 1వ తేదీ నుంచి ఇప్పటి వరకూ పలు మార్లు ఈ బెలూన్లను దక్షిణ కొరియా గగనతలంలోకి వదులుతోంది. ఇప్పటి వరకూ 6 వేలకుపైగా చెత్త బెలూన్లను ఉత్తర కొరియా వదిలినట్లు అంచనా. అయితే, బెలూన్లను వదలడం వెనుక పెద్ద ప్లానే ఉన్నట్లు దక్షిణ కొరియా దళాలు గుర్తించాయి. ఈ బుడగలకు జీపీఎస్ పరికరాలను అమర్చి పంపిస్తున్నట్లు గుర్తించాయి.
మరోవైపు ఈ బెలూన్లు దక్షిణ కొరియా వైమానిక రంగానికి సంకటంగా మారాయి. వీటి కారణంగా దక్షిణ కొరియాలో విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడుతోంది. రన్ వేలపై బెలూన్లు పడడంతో విమానాల రాకపోకలకు అంతరాయం కలుగుతోంది. పలు విమానాశ్రయాలు తరచూ మూతపడుతున్నాయి. ఆ చెత్త బెలూన్ల కారణంగా జూన్ నుంచి దక్షిణ కొరియా రాజధాని సియోల్‌కు చెందిన రెండు విమానాశ్రయాల్లోని (Seouls airports) రన్‌వేలను మూసివేయాల్సి వచ్చింది. జూన్ 1 నుంచి ఇచియాన్, గింపో ఎయిర్‌పోర్టుల్లో మొత్తం రన్‌వేలను దాదాపు 20 రోజుల్లోనే మూసివేయాల్సి వచ్చిందని దక్షిణ కొరియా అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. సియోల్ సైతం తమ గగతలంపైకి డ్రోన్లను పంపినట్లు ఉత్తర కొరియా ఆరోపిస్తోంది. దీనిపై ద.కొరియా మాత్రం నోరు విప్పడం లేదు.
Also Read..
Donald Trump | ట్రంప్‌పై మరోసారి హత్యా ప్రయత్నం.. ర్యాలీలో తుపాకీలతో వ్యక్తి హల్చల్
Bomb Threat | ముంబై – హౌరా మెయిల్‌కు బెదిరింపులు.. టైమర్ బాంబ్‌తో పేల్చేస్తామంటూ..
President’s Rule | ఆరేండ్ల తర్వాత.. జమ్ముకశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేత