ఢాకా : మాజీ ప్రధాని షేక్ హసీనాను అప్పగించాలని కోరుతూ బంగ్లాదేశ్‌లోని ఆపద్ధర్మ ప్రభుత్వం భారత్‌కు దౌత్యపరమైన లేఖ పంపింది. విద్యార్థుల నిరసనలతో హసీనా ప్రభుత్వం కూలిపోగా, ఆగస్టు 5న షేక్ హసీనా ఢాకాను వదిలి ఢిల్లీకి చేరుకున్నారు. మారణకాండకు, ఊచకోతకు పాల్పడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న షేక్ హసీనా, ఆమె మంత్రులు, సలహాదారులు, మాజీ సైనిక, ప్రభుత్వ అధికారులపై ఢాకాకు చెందిన అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్(ఐసీటీ) అరెస్టు వారెంట్లు జారీచేసింది. న్యాయ ప్రక్రియ కోసం హసీనాను వాపసు పంపాలని కోరుతూ భారత ప్రభుత్వానికి దౌత్య సందేశాన్ని పంపించినట్లు ఆపద్ధర్మ ప్రభుత్వంలో విదేశీ వ్యవహారాల సలహాదారు తౌహీద్ హుస్సేన్ విలేకరులకు తెలిపారు. హసీనా అప్పగింత కోసం చర్యలు తీసుకోవాలని భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వశాఖకు లేఖ రాసినట్టు హోం వ్యవహారాల సలహాదారు జహంగీర్ ఆలం ఇదివరకు వెల్లడించారు. భారత్, బంగ్లాదేశ్ మధ్య ఉన్న నేరస్తుల అప్పగింత ఒప్పందం ప్రకారమే హసీనాను వెనక్కు తీసుకువచ్చేందుకు చర్యలు చేపట్టామన్నారు.