Minister | మీటింగ్లో భాగంగా పక్కనోళ్ల భుజంపై చేయి వేయడం సాధారణమే. కానీ, అలా చేయి వేసిన ఓ మంత్రికి ఊహించని అనుభవం ఎదురైంది. ఏకంగా తన పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది.
న్యూజిలాండ్ (New Zealand) వాణిజ్య మంత్రి ఆండ్రూ బేలీ (Andrew Bayly) గతవారం ఓ చర్చలో భాగంగా మాట్లాడుతూ.. తన సిబ్బంది భుజంపై చేయి వేశారు (inappropriate touching). అయితే, ఈ అంశం స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది. సిబ్బందిపై చేయి వేయడాన్ని ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో తప్పుబట్టాయి. దీంతో ఈ అంశంపై స్పందించిన ఆండ్రూ బేలీ.. సిబ్బంది భుజంపై చేయి వేయడం అమర్యాదకర ప్రవర్తనగా అంగీకరించారు. ఈ క్రమంలోనే మంత్రి పదవికి రాజీనామా చేసినట్లు ఆండ్రూ బేలీ స్వయంగా ప్రకటించారు.
‘అలా ప్రవర్తించినందుకు క్షమించండి. చర్చలో లీనమైపోయి సిబ్బంది భుజంపై చేయి వేశాను. సిబ్బంది పట్ల అమర్యాదకరంగా ప్రవర్తించాను. అలా చేసి ఉండకూడదు. దీనిపై కేసు కూడా నమోదైంది’ అని బేలీ మీడియాకు వెల్లడించారు. గత వారం రాజీనామా చేసినట్లు చెప్పారు. తన రాజీనామాను న్యూజిలాండ్ ప్రధాన మంత్రి క్రిస్టోఫర్ లక్సన్ తాజాగా ఆమోదించినట్లు వెల్లడించారు. అయితే, మంత్రి పదవికి రాజీనామా చేసినప్పటికీ ఎంపీగా మాత్రం కొనసాగుతానని ఆయన స్పష్టం చేశారు.
కాగా, ఆండ్రూ బేలీపై విమర్శలు రావడం ఇదేమీ మొదటిసారి కాదు. గతేడాది అక్టోబర్లో జరిగిన ఓ కార్యక్రమానికి ఆండ్రూ మద్యం సేవించి హాజరయ్యారంటూ ఆరోపణలు వచ్చాయి. మద్యం మత్తులో తనను కించపరిచేలా మాట్లాడారంటూ సిబ్బంది ఆండ్రూ బేలీపై ఫిర్యాదు చేశారు. అయితే, ఈ ఆరోపణలను ఆండ్రూ తోసిపుచ్చారు. ఆ సమయంలో తాను మద్యం సేవించి లేనని తన మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చారు.
Also Read..
Donald Trump | మస్క్ పాదాలను ముద్దాడిన ట్రంప్.. యూఎస్ ప్రభుత్వ కార్యాలయంలోనే వీడియో ప్రదర్శన
Vivek Ramaswamy | ఓహియో గవర్నర్ పోటీలో వివేక్ రామస్వామి.. సిన్సినాటిలో ఎన్నికల ప్రచారం
Highway Collapses | ఘోర ప్రమాదం.. హైవేపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలి ఇద్దరు మృతి.. షాకింగ్ వీడియో