Vivek Ramaswamy | అమెరికాలో భారత సంతతి రాజకీయ నాయకుడు వివేక్ రామస్వామి (Vivek Ramaswamy).. తన సొంత రాష్ట్రమైన ఓహియో గవర్నర్‌గా పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. ఇందులో భాగంగానే తన ప్రచారాన్ని సోమవారం సిన్సినాటిలో ప్రారంభించి.. తన అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. ఇక రామస్వామి ప్రచారానికి ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ రాజకీయ సలహాదారులు మార్గనిర్దేశం చేయనున్నారు.
ఒహియో అటార్నీ జనరల్ దవే యోస్ట్ కూడా ఈ పదవికి పోటీ పడుతున్న విషయం తెలిసిందే. ఈ మేరకు తన అభ్యర్థిత్వాన్ని జనవరిలోనే ప్రకటించారు. అపలాచియాకు చెందిన నల్లజాతి పారిశ్రామికవేత్త హీథర్ హిల్, వైద్య విభాగం మాజీ డైరెక్టర్ డాక్టర్ ఎమీ ఏక్షన్ (డెమోక్రాట్) గవర్నర్ పదవి బరిలో దిగుతున్నారు.
కాగా, గతేడాది నవంబర్‌లో జరిగిన అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థిత్వం కోసం వివేక్ రామస్వామి పోటీ పడిన విషయం తెలిసిందే. చివరికి రేసు నుంచి తప్పుకున్నారు. ఆ తర్వాత ట్రంప్ గెలుపుకై తీవ్రంగా శ్రమించారు. ఈ నేపథ్యంలోనే తన గెలుపులో కీలక పాత్ర పోషించిన వివేక్ రామస్వామితోపాటు ఎలాన్ మస్క్‌కు తన కార్యవర్గంలో ట్రంప్ కీలక పదవులను కట్టబెట్టారు.
తన కార్యవర్గంలో కీలకమైన డోజ్ (DOGE) (డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫీషియెన్సీ) బాధ్యలను వారిద్దరికీ అప్పగించారు. మెరుగైన పాలన, ప్రభుత్వంలో వృథా ఖర్చుల్ని తగ్గించే ఎఫీషియెన్సీ శాఖకు వారిద్దరూ నేతృత్వం వహిస్తారని ట్రంప్ తెలిపారు. అయితే, డోజ్ నుంచి ఆయన అనూహ్యంగా తప్పుకున్నారు. ట్రంప్ అధ్యక్ష బాధ్యతలు చేపట్టిన గంటల వ్యవధిలోనే వివేక్ రామస్వామి తన నిర్ణయాన్ని వెల్లడించారు. ‘ఓహియోలో నా భవిష్యత్తు ప్రణాళికల గురించి త్వరలో మరిన్ని విషయాలు చెప్పాల్సి ఉంది. ముఖ్యంగా అమెరికాను మళ్లీ గొప్ప దేశంగా తీర్చిదిద్దడంలో అధ్యక్షుడు ట్రంప్‌కు మేమంతా సాయం చేయడానికి సిద్ధంగా ఉన్నాం’ అని ఆయన అప్పట్లో పేర్కొన్నారు. కాగా, ఒహియో గవర్నర్ (governor of Ohio) ఎన్నికలు వచ్చే ఏడాది (2026) నవంబర్‌లో జరగనున్నాయి.
Also Read..
Highway Collapses | ఘోర ప్రమాదం.. హైవేపై నిర్మాణంలో ఉన్న బ్రిడ్జి కూలి ఇద్దరు మృతి.. షాకింగ్ వీడియో
Golden Toilet: 30 కోట్ల ఖరీదైన బంగారు టాయిలెట్‌ను.. 5 నిమిషాలు చోరీ చేసిన దొంగలు