బుధవారం 02 డిసెంబర్ 2020
International - Nov 03, 2020 , 12:37:45

అమెరికాలో ప్రారంభ‌మైన ఓటింగ్‌.. బైడెన్‌కే తొలి ఓటు

అమెరికాలో ప్రారంభ‌మైన ఓటింగ్‌..  బైడెన్‌కే తొలి ఓటు

హైద‌రాబాద్‌: అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల‌కు ఓటింగ్ ప్రారంభ‌మైంది.  ఈశాన్య రాష్ట్ర‌మైన న్యూ హ్యాంప్‌షైర్‌లోని డిక్స్‌విల్లీ నాచ్ గ్రామంలో మంగ‌ళ‌వారం తెల్ల‌వారుజామున ప్ర‌జ‌లు ఓటేశారు. ఆ గ్రామంలో మొత్తం 12 మంది నివాసితులు ఉన్నారు.  అయితే పోలైన‌ అయిదు ఓట్లు బైడెన్ ఖాతాలో ప‌డ్డాయి. ట్రంప్‌కు ఒక్క ఓటు కూడా పోల‌వ్వ‌లేదు.  డిక్స్‌విల్లీ గ్రామ‌స్తులు ఏక‌ప‌క్షంగా డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థికి ఓటేశారు.  కెన‌డా బోర్డ‌ర్‌కు స‌మీపంలో ఉన్న అడ‌వుల్లో డిక్స్‌విల్లీ గ్రామం ఉన్న‌ది.  1960 నుంచి సాంప్ర‌దాయ‌బ‌ద్దంగా ఈ గ్రామం నుంచే అమెరికా ఎన్నిక‌ల రోజున ఓటింగ్ ప్ర‌క్రియ ప్రారంభం అవుతోంది.  అయితే డిక్స్‌విల్లీకి స‌మీపంలో ఉన్న మిల్స్‌ఫీల్డ్‌లో కూడా అర్థ‌రాత్రే ఓటింగ్‌లో పాల్గొంటుంది.  మిల్స్‌ఫీల్డ్‌లో ట్రంప్‌కు 16 ఓట్లు పోల‌య్యాయి. బైడెన్‌కు అయిదు ఓట్లు వేశారు.  గ‌త ఏడాది డిక్స్‌విల్లీ గ్రామం ఓట‌ర్లు హిల్ల‌రీ క్లింట‌న్‌కు ఓటేశారు. కానీ ఆ ఎన్నిక‌ల్లో ట్రంప్ విజ‌యం సాధించారు.  మరో గ్రామం హార్ట్స్ .. క‌రోనా వ‌ల్ల ఎన్నిక‌ల‌ను బ‌హిష్క‌రించింది. 

న్యూ హ్యాంప్‌షైర్‌లో ఉన్న మున్సిపాల్టీల్లో వంద క‌న్నా త‌క్కువ నివాసితులు ఉన్న గ్రామాల్లో అర్థ‌రాత్రే పోలింగ్ ప్రారంభం అవుతుంది. ఆ త‌ర్వాత రిజిస్ట‌ర్డ్ ఓట్లు పోలైన వెంట‌నే బూత్‌ల‌ను మూసివేస్తారు.  అమెరికాలోని తూర్పు తీర ప్రాంతంలో ఉన్న పోలింగ్ స్టేష‌న్లు అన్నీ ఉద‌యం 6 గంట‌ల‌కు తెరుచుకుంటాయి. అమెరికాలో జ‌రిగిన ముంద‌స్తు ఓటింగ్‌లో ఇప్ప‌టికే ప‌ది కోట్ల ఓట్లు పోల‌య్యాయి.  రిప‌బ్లిక్ అభ్య‌ర్థిగా అధ్య‌క్షుడు ట్రంప్‌, డెమోక్ర‌టిక్ అభ్య‌ర్థిగా జోసెఫ్ బైడెన్ పోటీప‌డుతున్న విష‌యం తెలిసిందే. ఓపీనియ‌న్ పోల్స్‌లో బైడెన్ ముందంజ‌లో ఉన్నా..  ట్రంప్ విక్ట‌రీ ఖాయ‌మ‌న్న అభిప్రాయాలూ వ్య‌క్తం అవుతున్నాయి.