Myanmar : మయన్మార్ (Myanmar) భూకంప (Earthquake) ప్రాంతంలో మృత్యుఘోష కొనసాగుతోంది. మార్చి 28న మధ్యాహ్నం అక్కడ సంభవించిన భారీ భూకంప ఘటనలో మృతుల సంఖ్య అంతకంతకూ పెరుగుతూనే ఉంది. తాజా సమాచారం ప్రకారం ఇప్పటిదాకా ఆ భూ విలయంలో మరణించిన వారి సంఖ్య 3,500 దాటింది. మరో 4,850 మంది గాయాలతో చికిత్స పొందుతున్నారు. ఇంకో 220 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది.
గత నెల 28న మధ్యాహ్నం నిమిషాల వ్యవధిలోనే 7.7, 6.3 తీవ్రతతో భూమి కంపించింది. ఈ ప్రకంపనలకు రోడ్లు, వంతెనలు, ఇళ్లు దెబ్బతిన్నాయి. అనేక భవనాలు నేలమట్టమయ్యాయి. ప్రభావిత ప్రాంతాల్లో పలు దేశాల రెస్క్యూ సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. మరోవైపు ప్రస్తుత విపత్తు కారణంగా మృతుల సంఖ్య 10 వేలు దాటే అవకాశం ఉందని యునైటెడ్ స్టేట్స్ జియోలాజికల్ సర్వే అంచనా వేసింది.
అయితే ఈ భూ విలయానికి ఇప్పుడు వర్షం తోడైంది. భూకంప ప్రభావిత ప్రాంతాల్లో కుంభవృష్టి కురుస్తోంది. బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. దాంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. రెస్క్యూ టీమ్స్ కోసం ఏర్పాటు శిబిరాల టెంట్లు గాలులకు కొట్టుకుపోతున్నాయి. వారికి సంబంధించిన సామాగ్రి పూర్తిగా తడిసిపోయింది. ఒకవైపు శిథిలాల కింద మృతదేహాలు, మరోవైపు భారీ వర్షాలు కురుస్తుండటంతో కలరా లాంటి వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి.