Donald Trump | నైజీరియా వాయవ్య ప్రాంతంలో ఐసిస్ ఉగ్రవాదులు లక్ష్యంగా అమెరికా భారీ దాడులు చేపట్టినట్లు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ‘‘నిరపరాధ క్రైస్తవులను దారుణంగా హతమార్చుతున్న ఐసిస్ ఉగ్రవాదులపై శక్తివంతమైన, ప్రాణాంతక దాడులు నిర్వహించాం’’ అని ట్రంప్ తెలిపారు. క్రిస్మస్ వేళ ఈ దాడులు జరగడం ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది.
కమాండర్ ఇన్ చీఫ్గా నా ఆదేశాల మేరకు నైజీరియా వాయవ్య ప్రాంతంలో ఐసిస్ ఉగ్రవాదులపై అమెరికా సైన్యం ఖచ్చితమైన దాడులు చేసిందని ట్రంప్ తన సోషల్మీడియా వేదిక ట్రూత్ సోషల్ ద్వారా వెల్లడించారు. ప్రధానంగా క్రైస్తవులపై జరుగుతున్న దాడులకు ఇది తమ ప్రతిస్పందన అని తెలిపారు. రాడికల్ ఇస్లామిక్ టెర్రరిజం ఎదగడానికి తమ పాలనలో అవకాశం ఉండదని స్పష్టం చేశారు. అమెరికా సైన్యానికి ఆ దేవుడి ఆశీర్వాదాలు ఉండాలని ఆకాంక్షించారు. చనిపోయినా ఉగ్రవాదులకు కూడా మెరీ క్రిస్మస్ అంటూ శుభాకాంక్షలు తెలిపారు.
నైజిరియాలో ఉగ్రవాదులపై అమెరికా సైన్యం దాడులను US ఆఫ్రికా కమాండ్ కూడా ధ్రువీకరించింది. నైజీరియా ప్రభుత్వ అభ్యర్థన మేరకు దాడులు నిర్వహించామని వెల్లడించింది. తమ దాడిలో పలువురు ఐసిస్ ఉగ్రవాదులు హతమయ్యారని వెల్లడించింది. అయితే తమ దేశంలోని భద్రతా సమస్యలు మతపరమైన కోణానికి మాత్రమే పరిమితం కావని నైజీరియా ప్రభుత్వం స్పష్టం చేసింది. ముస్లింలు, క్రైస్తువులు రెండు మతాల వారిపైనా దాడులు జరుగుతున్నాయని తెలిపింది. క్రైస్తవులపై మాత్రమే దాడులు జరుగుతున్నాయన్న ట్రంప్ వ్యాఖ్యలు తమ దేశంలోని పరిస్థితులకు సరిపోవని తెలిపింది. అయినప్పటికీ ఉగ్రవాదాన్ని ఎదుర్కొనేందుకు అమెరికాతో కలిసి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామని ప్రకటించింది.