జొహన్నెస్‌బర్గ్: జీ20 సదస్సు (G20 Summit) నిర్వహణపై దక్షిణాఫ్రికా అధ్యక్షుడు సిరిల్ రమఫోసా (Cyril Ramaphosa) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇటీవల దక్షిణాఫ్రికాలోని జొహన్నెస్‌బర్గ్‌లో రెండు రోజుల పాటు జీ20 సమావేశాలు జరిగిన విషయం తెలిసిందే. ఆఫ్రికా ఖండంలో ఈ సదస్సు జరగడం ఇదే మొదటిసారి. ఈ సమావేశానికి ప్రధాని మోదీ (PM Modi) హాజరైన విషయం తెలిసిందే. ఆదివారం భారత్, దక్షిణాఫ్రికా నేతలు ద్వైపాక్షిక చర్చలు నిర్వహించారు. ఈ సందర్భంగా రమఫోసా మాట్లాడుతూ.. జీ20 శిఖరాగ్ర సమావేశాల నిర్వహణలో భారత్ అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఇంత కష్టమైన పని అని చెప్పి ఉంటే.. ముందే పారిపోయేవాళ్లమని సరదాగా వ్యాఖ్యానించారు. సదస్సు నిర్వహణ విషయంలో భారత్ నుంచి చాలా నేర్చుకున్నామని తెలిపారు. భారత్ జీ20 సదస్సు ప్రాంగణం చాలా గొప్పగా ఉందని, తమ వేదిక చాలా చిన్నదని చెప్పారు. అయితే, ఇటువంటి వేదికలే ఎల్లప్పుడూ అందంగా ఉంటాయని ప్రధాని మోదీ (Narendra Modi) స్పందించారు. 2023, సెప్టెంబర్‌లో 18వ జీ20 సదస్సును ఢిల్లీలోని భారత్ మండపంలో నిర్వహించిన విషయం తెలిసిందే.
#BREAKING: South African President Cyril Ramaphosa told PM Modi, “Thank for the support India gave to South Africa in hosting the G20. You should have told us, it is such a difficult task, maybe we would have run away.” #G20SouthAfrica pic.twitter.com/rMXoKTonEJ
— OSINT Spectator (@osint1117) November 23, 2025
కాగా, ఉగ్రవాదులకు, మాదకద్రవ్యాలకు మధ్యనున్న సంబంధాలకు అడ్డుకట్ట వేద్దామని ప్రధాని మోదీ పిలుపునిచ్చిన్నారు. భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికాతో కూడిన ఇబ్సా (IBSA) డిజిటల్ ఇన్నోవేషన్ అలయన్స్ ఏర్పాటును ప్రతిపాదించారు. కృత్రిమ మేధ (ఏఐ) దుర్వినియోగాన్ని నిరోధించేందుకు ప్రపంచం సామూహికంగా ఓ అంగీకారానికి రావాలన్నారు. ముఖ్యమైన సాంకేతిక పరిజ్ఞానం మానవుని కేంద్రంగా ఉండాలని, ఆర్థిక కేంద్రంగా ఉండకూడదని హెచ్చరించారు. అదేవిధంగా ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణలు ఇక ఎంత మాత్రం ఓ ఎంపిక కాదని, అవసరమని చెప్పారు. అంతర్జాతీయ పాలనా వ్యవస్థలకు ఈ సందేశాన్ని భారత్-బ్రెజిల్-దక్షిణాఫ్రికా త్రయం పంపించాలన్నారు.
జీ20 సదస్సులో మరో వివాదం చోటుచేసుకున్నది. ఆదివారం సాయంత్రం శిఖరాగ్ర సమావేశాలు ముగిశాయి. ఈ సందర్భంగా తదుపరి జీ-20 సదస్సు నిర్వహించే దేశానికిచ్చే అధ్యక్ష బాధ్యతలు ఇవ్వడానికి దక్షిణాఫ్రికా నిరాకరించింది. తమ దేశాధ్యక్షుడు అధ్యక్ష బాధ్యతలను అమెరికా అధికారికి అప్పగించబోరని సౌతాఫ్రికా విదేశాంగ మంత్రి స్పష్టం చేశారు. అమెరికా జీ20లో మెంబర్ వారు ఈ శిఖరాగ్ర సదస్సును రిప్రజెంట్ చేయాలంటే ఏవరినైనా సరైన హోదా గల వ్యక్తిని తమ దేశానికి పంపాలని తెలిపారు. వారు దేశాధ్యక్షుడైనా లేదా మంత్రి అయినా, ప్రభుత్వం నియమించిన ప్రత్యేక రాయబారి అయినా కావచ్చని వెల్లడించారు. లేకపోతే ఆ బాధ్యతలను ప్రభుత్వ కార్యాలయంలో ఒకే ర్యాంకు గల అధికారులతో మార్పు చేయబడుతుందని చెప్పారు. కాగా, జీ20 సదస్సుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దూరంగా ఉన్న విషయం తెలిసిందే. దక్షిణాఫ్రికాలో శ్వేత జాతీయులపై అక్కడి ప్రభుత్వం వేదింపులకు పాల్పడుతున్నదని ట్రంప్ ఆరోపించారు. ఈ నేపథ్యలో జీ20 శిఖరాగ్ర సదస్సులో తమ దేశం పాల్గొనబోదని స్పష్టం చేశారు. దీంతో ఇరుదేశాల మధ్య విభేదాలు తారాస్థాయికి చేరాయి. తదుపలి జీ20 శిఖరాగ్ర సమావేశాలు అజమెరికాలో జరగాల్సి ఉన్నాయి.