కాలిఫోర్నియా, డిసెంబర్ 2: అమెరికాలో పలు టెక్ కంపెనీలు ‘వర్క్ ఫ్రమ్ హోమ్’ విధానానికి ముగింపు పలుకుతున్నాయి. ఇప్పుడా జాబితాలో ఇన్స్టాగ్రామ్ కూడా చేరింది. ఫిబ్రవరి 2026 నుంచి సిబ్బంది వారానికి ఐదు రోజులు ఆఫీసుకు రావాల్సిందేనని కంపెనీ సీఈవో ఆడమ్ మొస్సేరీ డెడ్‌లైన్ విధించినట్టు తెలిసింది. రాబోయే ఏడాది సంస్థ మరిన్ని సవాళ్లు ఎదుర్కొనబోతున్నదని, సంస్థలోని వారందరికీ 2026 ఏడాది అంత సులభం కాదని నర్మగర్భంగా వ్యాఖ్యలు చేశారు.
2020 కొవిడ్ సమయంలో, అటు తర్వాత అమెరికాలోని ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయడానికి అవకాశం కల్పించింది. సంస్థ సీఈవో జారీచేసిన మెమో ప్రకారం, అమెరికా వ్యాప్తంగా ఇన్స్టాగ్రామ్ ఆఫీసుల్లో దీనిని అమలుజేస్తున్నట్టు తెలిసింది. అమెజాన్, ఆల్భాబెట్, యాపిల్, మైక్రోసాఫ్ట్ సహా పలు టెక్ కంపెనీలు అమెరికాలో వర్క్ ఫ్రమ్ హోమ్‌ను ఇప్పటికే రద్దు చేశాయి.