Mohamed Muizzu : మాల్దీవుల అధ్యక్షుడిగా ఎన్నికైనప్పటి నుంచి భారత్‌తో అంటీముట్టనట్టుగా వ్యవహరించిన మహమ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) ఇప్పుడు స్టాండ్ మార్చారు. భారత్‌పట్ల సానుకూల వ్యాఖ్యలు చేశారు. మాల్దీవులు సన్నిహిత మిత్ర దేశాల్లో భారత్ ఒకటని, ముఖ్యమైన భాగస్వామి అని వ్యాఖ్యానించారు. తమ దేశం అవసరంలో ఉన్నప్పుడల్లా సాయంలో ముందుంటుందని పొగిడారు.
మాల్దీవులు అధ్యక్ష కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ముయిజ్జు ఈ విధంగా స్పందించారు. మాల్దీవుల్లోని 28 ద్వీపాలకు నీటి సరఫరా, మురుగునీటి పారుదల ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఆ సౌకర్యాల కల్పనకు భారత్ సహకరించింది. ఇందుకోసం ఎగ్జిమ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వడ్డీ రాయితీతో రుణాన్ని అందించింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ముయిజ్జు మాట్లాడారు.
ఈ ప్రాజెక్టులు రెండు దేశాల ద్వైపాక్షిక సంబంధాల్లో కీలక మైలురాయి అని వ్యాఖ్యానించారు. భారత్‌తో ఉన్న చారిత్రక సన్నిహిత సంబంధాలను మరింత బలోపేతం చేసేందుకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. తమ దేశంపట్ల చూపుతున్న ఉదారతకు ప్రధాని నరేంద్రమోదీ, భారత ప్రభుత్వం, ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గతంలోనూ రుణ విముక్తి కోసం ముయిజ్జు విజ్ఞప్తి చేశారు.
గత ఏడాది చివరి నాటికి భారత్‌కు మాల్దీవులు దాదాపు 400.9 మిలియన్ డాలర్లు బకాయిపడింది. దీన్ని తిరిగి చెల్లించడంలో ఉపశమనం కలిగించాలని కొద్ది నెలల క్రితం ద్వీప దేశం ప్రాదేయపడింది. అందుకు భారత్ అంగీకరించింది. ఇదిలావుంటే నరేంద్ర మోదీ మూడోసారి ప్రధానమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన కార్యక్రమానికి కూడా ముయిజ్జు హాజరయ్యారు. ఈ ఏడాది ప్రారంభంలో మోదీ కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ (Lakshadweep) లో పర్యటించారు.
అప్పుడు మాల్దీవుల ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నవారు చేసిన వ్యాఖ్యలతో రెండు దేశాల మధ్య దూరం పెరిగింది. దాంతో సోషల్ మీడియాలో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. బాయ్‌కాట్ మాల్దీవ్స్ పేరిట హ్యాష్‌ట్యాగ్ ట్రెండ్ అయింది. ఆ వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టిన మాల్దీవులు.. ఆ వ్యాఖ్యలతో తమ ప్రభుత్వానికి ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. అనంతరం సదరు మంత్రులపై వేటు వేసింది.
విభేదాలు ముదురుతున్నాయని భావిస్తున్న తరుణంలో ఆ దేశ విదేశాంగ మంత్రి మూసా జమీర్ మన దేశానికి వచ్చి.. ‘ఆ నేతలు చేసిన వ్యాఖ్యలు మా ప్రభుత్వ అభిప్రాయం కాదు. అలాంటి వైఖరి పునరావృతం కాకుండా మేం తగిన చర్యలు తీసుకుంటున్నాం’ అని చెప్పారు. ఈ పరిణామాల నేపథ్యంలో తాజాగా భారత విదేశాంగ మంత్రి జైశంకర్ మాల్దీవులకు వెళ్లారు. ‘పొరుగుకే తొలి ప్రాధాన్యం’ అనే భారత పాలసీలో మాల్దీవులకు ముఖ్యపాత్ర ఉందని చెప్పారు.