లండన్ : అహ్మదాబాద్ విమాన ప్రమాదం నుంచి బయటపడిన ఏకైక వ్యక్తి ప్రస్తుతం అంతులేని అగాథంలో చిక్కుకున్నారు. శారీరక, మానసిక సమస్యలతో సతమతమవుతున్నారు. ఎయిరిండియా తగిన రీతిలో సహకారం అందించడం లేదని ఆయన కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జూన్ 12న అహ్మదాబాద్‌లో జరిగిన ఎయిరిండియా ఏఐ171 విమాన ప్రమాదంలో 241 మంది మరణించారు.
విశ్వాస్ కుమార్ రమేశ్ ఒక్కరే బయటపడటంతో ఆయన అదృష్టవంతుడని అందరూ భావించారు. అదే విమానంలో కొన్ని సీట్ల దూరంలో ఉన్న ఆయన సోదరుడు మరణించడం ఆయన కుటుంబంలో అంతులేని విషాదాన్ని మిగిల్చింది. బ్రిటిష్ జాతీయుడైన రమేశ్ భారత్‌లో ఉన్నపుడు దవాఖాన సంరక్షణలో ఉండేవారు. ఆయన పోస్ట్ ట్రమటిక్ స్ట్రెస్ డిజార్డర్‌తో బాధపడుతున్నట్లు వైద్యులు తెలిపారు.