Om Birla : లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా బంగ్లాదేశ్ వెళ్లనున్నారు. అక్కడ ఈ నెల 17న బంగ్లా ప్రధానిగా తారిఖ్ రహమాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి ఓంబిర్లా దేశ ప్రతినిధిగా హాజరుకానున్నారు. ఇటీవల బంగ్లాదేశ్‌లో పార్లమెంట్ ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఎన్నికల్లో బీఎన్పీ అధికారం చేజిక్కించుకుంది. ఈ పార్టీ తరఫున తారిఖ్ రహమాన్ బంగ్లాదేశ్ ప్రధానిగా ఎన్నికకానున్నారు.
ఆయన ప్రమాణ స్వీకార కార్యక్రమం ఈ నెల 17న జరగనుంది. ఈ వేడుకకు పలు దేశాలకు చెందిన నేతలను బంగ్లా ప్రభుత్వం ఆహ్వానించింది. మన ప్రధాని నరేంద్ర మోదీకి కూడా బంగ్లా ఆహ్వానం పంపింది. ఢాకాలో జరిగే రహమాన్ ప్రమాణ స్వీకారానికి అతిథిగా హాజరుకావాలని కోరింది. అయితే, అదే రోజు ప్రధాని మోదీకి వేరే కార్యక్రమం ఉంది. ఫ్రెంచ్ ప్రెసిడెంట్ ఇమాన్యుయెల్ మ్యాక్రాన్ ఇండియాలో పర్యటించనున్నారు. ఆయనను 17న మోదీ ముంబైలో కలుస్తారు. ఇది చాలా రోజుల క్రితమే ఫిక్సైంది. అందువల్ల మోదీ.. బంగ్లాదేశ్ వెళ్లలేరు. ఈ నేపథ్యంలో స్పీకర్ ఓం బిర్లా ఈ కార్యక్రమానికి ఇండియా ప్రతినిధిగా, అధికారికంగా హాజరవుతారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. రహమాన్ ప్రమాణ స్వీకారానికి ఓం బిర్లా హాజరు కావడం ఇరు దేశాల సంబంధాలకు, ప్రజాస్వామ్య విలువలకు అద్దం పడుతోందని, బంగ్లాకు భారత ప్రాధాన్యాన్ని తెలియజేస్తుందని కేంద్రం తెలిపింది.
ఇక ఇండియా నుంచి ఓం బిర్లా హాజరుకానుండగా, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ కూడా హాజరవుతున్నారు. ఇండియా, పాక్‌లతోపాటు చైనా, సౌదీ అరేబియా, టర్కీ, యూఏఈ, ఖతార్, మలేసియా, బ్రూనే, శ్రీలంక, నేపాల్, మాల్దీవ్స్, భూటాన్‌లకు కూడా బంగ్లాదేశ్‌లోని యూనస్ ప్రభుత్వం ఆహ్వానం పలికింది. ఇటీవల జరిగిన బంగ్లా ఎన్నికల్లో 297 సీట్లకుగాను.. 209 సీట్లలో బీఎన్పీ విజయం సాధించింది.