Gold Mine | ఇండోనేషియా (Indonesia)లో ఘోర ప్రమాదం సంభవించింది. అక్రమంగా నిర్వహిస్తున్న బంగారు గని (Gold Mine)లో కొండచరియలు విరిగిపడ్డాయి (Landslide triggered). ఈ ఘటనలో సుమారు 11 మంది మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. సులవేసి ద్వీపం (Sulawesi island)లో ఈ ఘటన చోటు చేసుకుంది.
స్థానిక మీడియా వెల్లడించిన వివరాల ప్రకారం.. గోరంటాలో ప్రావిన్స్‌లోని రిమోట్ బోన్ బొలాంగో జిల్లాలో కొందరు అక్రమంగా బంగారు గనిని నిర్వహిస్తున్నారు. ఆదివారం సుమారు 35 మంది గ్రామస్థులు బంగారు గనిలో పనులు చేస్తున్నారు. ఆ సమయంలో భారీ వర్షాల కారణంగా కొండచరియలు ఒక్కసారిగా విరిగి గనిలో పనిచేస్తున్న వారిపై పడ్డాయి. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయినట్లు గోరంటాలో సెర్చ్ అండ్ రెస్క్యూ ఏజెన్సీ ప్రతినిధి అఫిఫుద్దీన్ ఇలాహుడే తెలిపారు. ఆదివారం ఐదుగురు వ్యక్తులను కాపాడినట్లు చెప్పారు. మొత్తం 11 మంది మృతదేహాలను సోమవారం గని నుంచి వెలికితీసినట్లు పేర్కొన్నారు. ఈ ఘటనలో సుమారు 19 మంది గల్లంతయ్యారని.. వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు.
కాగా, శనివారం నుంచి ఈ ప్రాంతంలో కుండపోతగా వర్షాలు కురుస్తున్నట్లు జాతీయ విపత్తు నిర్వహణ సంస్థ ప్రతినిధి అబ్దుల్ ముహారీ తెలిపారు. ఈ వర్షాలకు ఓ కట్ట కూడా విరిగిందని దీంతో బోన్ బొలాంగోలోని ఐదు గ్రామాలను వరదలు ముంచెత్తినట్లు పేర్కొన్నారు. ఈ వరదలకు దాదాపు 300 ఇళ్లు ప్రభావితమయ్యాయి, 1,000 మందికి పైగా ప్రజలు సురక్షితంగా బయటపడ్డారని వివరించారు.
Also Read..
Kim Yo Jong | అలా చేస్తే విధ్వంసమే.. దక్షిణ కొరియాకు కిమ్ సోదరి స్ట్రాంగ్ వార్నింగ్
PM Modi | మోదీ పర్యటన పట్ల పాశ్చాత్య దేశాలు ఈర్ష్యతో ఉన్నాయి.. రష్యా వ్యాఖ్యలు