Klyuchevskoy volcano | రష్యాను భారీ భూకంపం వణికించిన విషయం తెలిసిందే. రష్యాకు తూర్పు ప్రాంతంలో బుధవారం ఉదయం 8.8 తీవ్రతతో భారీ భూకంపం సంభవించింది. దీంతో పసిఫిక్ మహాసముద్రంలోని దాదాపు అన్ని దేశాలకు సునామీ ముప్పు ఏర్పడింది. రష్యాతోపాటు జపాన్, అమెరికాలోని పలు తీర ప్రాంతాలను సునామీ అతలాకుతలం చేసింది. ఇక ఈ భారీ భూకంపం తర్వాత రష్యాలోని కమ్చట్కా ద్వీపకల్పం (Kamchatka peninsula)లోని క్లూచెవ్స్కోయ్ అగ్నిపర్వతం (Klyuchevskoy volcano) విస్ఫోటనం చెందింది.
భూకంపం తర్వాత అగ్నిపర్వతం విష్ఫోటనం చెందడం ప్రారంభించిందని అక్కడి భౌగోళిక శాస్త్రవేత్తలు తెలిపారు. ఈ అగ్నిపర్వతం నుంచి పెద్ద ఎత్తున లావా ఎగసిపడుతున్నట్లు వెల్లడించారు. పెట్రోపావ్లోవ్స్క్-కమ్చట్స్కీకి ఉత్తరాన 450 కి.మీ (280 మైళ్ళు) దూరంలో ఉన్న క్లూచెవ్స్కోయ్ అగ్నిపర్వతం ప్రపంచంలోని ఎత్తైన అగ్నిపర్వతాల్లో ఒకటి. ఇది ఇటీవలే కాలంలో చాలాసార్లు విస్ఫోటనం చెందింది. ఇప్పుడు భారీ భూకంపంతో ఈ అగ్నిపర్వతం బద్ధలైనట్లు అక్కడి అధికారులు వెల్లడించారు.
రష్యా కు తూర్పున ఉన్న కామ్చట్కా ద్వీపకల్పంలో 8.8 తీవ్రతతో భూకంపం సంభవించినట్టు జపాన్ వాతావరణశాఖ వెల్లడించింది. రష్యాలో ఇంత తీవ్రతతో భూకంపం రావడం ఇదే మొదటిసారి. భూకంపం కారణంగా వచ్చిన సునామీ ప్రభావంతో కామ్చట్కా ఉపఖండంలోని నౌకాశ్రయాలతోపాటు జపాన్ తీరం, అమెరికాలోని హవాయి రాష్ట్ర తీరప్రాంతాలు సముద్రపు నీటిలో మునిగిపోయాయి. మూడు మీటర్ల కన్నా ఎత్తయిన అలలు వరుసగా దాడి చేశాయని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. తీర ప్రాంత ప్రజలు ఎత్తయిన ప్రదేశాలవైపు పరుగులు తీయడంతో అనేక దేశాల్లో ట్రాఫిక్ స్తంభించిపోయింది. భూకంపం, సునామీ కారణంగా ఆస్తి, ప్రాణ నష్టం సంభవించినట్టు ఎటువంటి సమాచారం వెలువడలేదు.
Also Read..
సునామీ భయం భయం.. రష్యాను వణికించిన భారీ భూకంపం
Air Traffic Glitch | ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ వ్యవస్థలో సాంకేతిక సమస్య.. రద్దైన వందలాది విమానాలు