శనివారం 27 ఫిబ్రవరి 2021
International - Jan 17, 2021 , 14:09:16

మొన్నటి కిమ్‌ పరేడ్‌ జో బైడెన్‌కు హెచ్చరికనా..?!

మొన్నటి కిమ్‌ పరేడ్‌ జో బైడెన్‌కు హెచ్చరికనా..?!

ప్యాంగ్యాంగ్‌‌ : ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్‌ ఉన్ రెండు రోజుల క్రితం చేపట్టిన మిలిటరీ పరేడ్‌ అమెరికా కొత్త అధ్యక్షుడు జో బైడెన్‌కు హెచ్చరికనా..? కిమ్‌ తన ఆయుధ సంపత్తిని పరేడ్‌లో కవాతు రూపంలో ప్రదర్శించడం ద్వారా బైడెన్‌ బెదిరిపోతాడా..? ఒకవైపు అమెరికా-ఉత్తర కొరియా మధ్య సంబంధాలు క్షీణిస్తూ ఉండగా.. ఇలాంటి హెచ్చరికలు దేనిక సంకేతంగా భావించాలి? ఎంతటి విపత్తునైనా ఎదుర్కొనేందుకు తమ దళాలు సిద్ధంగా ఉన్నాయని అమెరికాకు కిమ్‌ చెప్పాల్సి రావడంలో అంతర్యం ఏమిటి? 

ఇక్కడ పేర్కొన్న అంశాలను పరిశీలిస్తే.. రానున్న రోజుల్లో తమకు ప్రాధాన్యం ఇవ్వాలని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌కు చెప్పకనే చెప్తున్నట్లుగా తెలుస్తున్నది. మరో మూడు రోజుల్లో అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణం స్వీకరించనున్న జో బైడెన్‌.. అత్యవసరంగా ఉత్తర కొరియాతో స్నేహం చేసేందుకు ప్రాధాన్యం ఇస్తారని అనుకోవడం పొరపాటని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. ఎందుకంటే ఉత్తర కొరియాతో బైడెన్‌కు సన్నిహత సంబంధాలు లేవు. ఈ విషయాన్ని గుర్తించిన కిమ్‌.. తమకు ప్రాధాన్యం ఇవ్వడం గుర్తించి అమెరికాకు తెలిపేందుకు నాలుగు రోజుల క్రితం సైనిక కవాతు నిర్వహించినట్లుగా పరిశీలకులు చెప్తున్నారు. సైనిక కవాతులో కొత్త ఆయుధాలను ఆవిష్కరించడం కూడా బైడెన్‌తో స్నేహసంబంధాలను నెరపడం కోసమే అని గుర్తించాలంటున్నారు వారు.

నాలుగు రోజుల క్రితం జరిగిన సైనిక కవాతుకు కిమ్ అధ్యక్షత వహించారు, ఎనిమిదవ వర్కర్స్ పార్టీ కాంగ్రెస్ ముగింపునకు గుర్తుగా.. పూర్తి సన్నద్ధత కవాతును నిర్వహించారు. ఈ కవాతులో కొత్త జలాంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్‌ క్షిపణులు (ఎస్‌ఎల్‌బీఎం)లు ఉండటం విశేషం. ఉత్తర కొరియా తొలిసారిగా 2019 లో జలంతర్గామి నుంచి ప్రయోగించే బాలిస్టిక్‌ క్షిపణులను పరీక్షించింది. ప్యాంగ్యాంగ్‌ సముద్రంలో మోహరించిన క్షిపణులపై అణు వార్‌హెడ్‌లను ప్రదర్శించే అవకాశాన్ని పెంచింది. ఉత్తర కొరియా ఇప్పుడు ఎస్‌ఎల్‌బీఎంలను మోసుకెళ్ళే, పేల్చగల సామర్థ్యం ఉన్న జలాంతర్గామిని అభివృద్ధి చేస్తుందని నమ్ముతున్నారు. ఉత్తర కొరియా ఇప్పటికే సిద్ధాంతపరంగా అణు వార్‌హెడ్‌లతో అగ్రస్థానంలో ఉన్నది. బైడెన్ పదవీ బాధ్యతలు చేపట్టడానికి ముందే కిమ్ కొత్త ఆయుధాలను ఆవిష్కరించే అవకాశాన్ని ఉపయోగిస్తాడన్న ఊహాగానాలు చెలరేగాయి. అనుకున్నట్లుగానే బైడెన్‌ ప్రమాణం స్వీకరించడానికి వారం ముందుగా తన సైనిక బలగాన్ని కిమ్ ప్రదర్శించారు. ఇది ఎంతమాత్రమూ అమెరికాను బెదిరించేందుకు కాదని దక్షిణ కొరియా రాజధాని సియోల్‌లోని యూనివర్శిటీ ఆఫ్ నార్త్ కొరియా స్టడీస్ ప్రొఫెసర్ యాంగ్ మూ-జిన్ స్పష్టం చేశారు. మరో ఎస్‌ఎల్‌బీఎంను ఆవిష్కరించే కిమ్ నిర్ణయం తమకు ప్రాధాన్యత ఇవ్వండి బైడెన్‌ చెప్పాలన్న సంకేతంగా చూడాలన్నారాయన. ప్రస్తుతానికైతే ఉత్తర కొరియాకు ఎస్‌ఎల్‌బీఎం అవసరం లేదని యాంగ్ అన్నారు. బైడెన్ పరిపాలనలో అమెరికాపై ఒత్తిడి తెచ్చే ఉద్దేశంతోనే సైనిక కవాతు చేపట్టారని భావించాలని, తమకు వ్యతిరేకంగా ఉన్న విధానాలను ఉపసంహరించుకోవాలన్నదే వారి అభిమతం అని ఆయన పేర్కొన్నారు.

రానున్న రోజుల్లో కిమ్‌ కోరుకుంటున్నట్లుగా ఉత్తర కొరియాకు అమెరికా ప్రాధాన్యం ఇస్తుందా? వారికి వ్యతిరేకంగా ఉన్న విధానాలను బైడెన్‌ ప్రభుత్వం రద్దు చేస్తుందా? అనేది ఆసక్తికరంగా మారిందని అంతర్జాతీయ రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు.

ఇవి కూడా చదవండి..

అమెరికాలో అతి పెద్ద రైతు ఎవరో తెలుసా..?

భారత రాజకీయ చరిత్రలో ఆయనదో పేజీ..

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.

VIDEOS

logo