Israeli strikes | గాజా (Gaza )లో ఇజ్రాయెల్ మారణహోమాన్ని (Israeli strikes) సృష్టిస్తోంది. వరుసగా మూడోరోజు భీకర దాడులకు పాల్పడింది. గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజామున వరకు వైమానిక దాడులతో (Air strikes) విరుచుకుపడింది. ఈ దాడుల్లో డజన్ల కొద్దీ ప్రజలు ప్రాణాలు కోల్పోయినట్లు అక్కడి ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు.
డీర్ అల్-బాలా, ఖాన్ యూనిస్ నగర శివారుల్లో ఇజ్రాయెల్ దళాలు భీకర దాడులకు పాల్పడినట్లు అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో 64 మంది ప్రాణాలు కోల్పోయినట్లు చెప్పారు. 48 మృతదేహాలను ఇండోనేషియా ఆసుపత్రికి తరలించగా.. మరో 16 మృతదేహాలను నాజర్ ఆసుపత్రికి తరలించినట్లు అధికారులు వెల్లడించారు. ఇక ఈ దాడుల్లో వంద మందికిపైగా గాయపడినట్లు చెప్పారు. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పశ్చిమాసియా పర్యటనలో ఉండగా.. ఐడీఎఫ్ దళాలు గాజాపై వరుస దాడులకు పాల్పడుతుండటం గమనార్హం.
గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేయడం ఇది వరుసగా మూడోరోజు. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ నగరంపై బుధ-గురువారాల మధ్య రాత్రి ఇజ్రాయెల్ నిర్వహించిన దాడుల్లో 54 మంది మరణించారు. మృతుల్లో ఓ పాత్రికేయుని కుటుంబ సభ్యుల్లో 11 మంది కూడా ఉన్నారు. అంతకు ముందు మంగళవారం రాత్రి బుధవారం తెల్లవారుజామున మధ్య జరిగిన దాడుల్లో 22 మంది చిన్నారులు సహా మొత్తం 70 మంది ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా గత మూడు రోజుల వ్యవధిలోనే ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో గాజాలో 180 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఇటీవలే మాట్లాడుతూ.. గాజాలో యుద్ధాని ఆపడానికి ఎలాంటి మార్గం లేదని వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. హమాస్ ఉగ్రవాద సంస్థను అంతం చేసే వరకు గాజా స్ట్రిప్‌లో యుద్ధం కొనసాగుతుందన్నారు. దీంతో కాల్పుల విరమణపై అవకాశాలు సన్నగిల్లాయి.
Also Read..
Pakistani beggars | మిత్ర దేశాల్లో పాకిస్థాన్ బిచ్చగాళ్లు.. ఏకంగా 5033 మందిని వెళ్లగొట్టిన సౌదీ
Covid Cases | మళ్లీ కోరలు చాస్తున్న కరోనా మహమ్మారి.. ఆ దేశాల్లో హై అలర్ట్
Donald Trump | ట్రంప్‌కు వినూత్నంగా స్వాగతం పలికిన యూఏఈ.. వీడియో చూశారా..?