Pakistani beggars : తాము ఏ మిత్ర దేశానికి వెళ్లినా అడుక్కోవడానికే వచ్చామన్నట్లు చూస్తారని మూడేళ్ల క్రితం పాకిస్థాన్ ప్రధాని (Pakistan PM) షెహబాజ్ షరీఫ్ (Shehbaj Sharif) ఓ సమావేశంలో అన్నారు. ఆయన ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో గానీ, మిత్ర దేశాలను మాత్రం పాకిస్థాన్ బిచ్చగాళ్లు (Pakistan beggars) హడలెత్తిస్తున్నారు. కొందరు పాకిస్థానీలు యాత్రికుల వీసాలను తీసుకుని వెళ్లి మరీ మిత్ర దేశాల్లో భిక్షాటన చేస్తున్నారు. ఫలితంగా యాచకులను ఎగుమతి చేసే దేశంగా పాకిస్థాన్ అపకీర్తిని మూటగట్టుకుంది.
ఈ క్రమంలో సౌదీ అరేబియా తాజాగా తమ దేశంలో ఉన్న పాకిస్థానీ బిచ్చగాళ్లను స్వదేశానికి పంపుతోంది. ఇప్పటివరకు ఏకంగా 5033 మంది బిచ్చగాళ్లను బలవంతంగా పాకిస్థాన్‌కు వెళ్లగొట్టింది. పాకిస్థాన్ మిగతా మిత్రదేశాలు కూడా సౌదీ బాటనే అనుసరిస్తున్నారు. ఆయా దేశాలు కూడా 369 మంది పాకిస్థానీ బిచ్చగాళ్లను స్వదేశానికి పంపించాయి. ఈ విషయాన్ని పాకిస్థాన్ ఇంటీరియర్ మంత్రి మొహసిన్ నక్వీ ఇటీవల ఆ దేశపు నేషనల్ అసెంబ్లీలో వెల్లడించారని డాన్ పత్రిక తన కథనంలో పేర్కొంది.
అంటే 2024 జనవరి నుంచి మిత్ర దేశాలు తరిమేసిన పాకిస్థాన్ బిచ్చగాళ్ల సంఖ్య 5,402. బిచ్చగాళ్లను వెళ్లగొట్టిన పాకిస్థాన్ మిత్రదేశాల్లో సౌదీతోపాటు.. ఇరాక్, మలేసియా, ఒమన్, ఖతార్, యూఏఈ ఉన్నాయి. తిరిగొచ్చిన పాకిస్థాన్ బిచ్చగాళ్లలో సింధి ప్రావిన్స్‌కు చెందినవాళ్లు 2,795 మంది, పంజాబ్ ప్రావిన్స్ నుంచి 1,437 మంది, ఖైబర్ ఫక్తుంక్వా నుంచి 1,002 మంది, బలోచిస్థాన్ నుంచి 125 మంది, పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ నుంచి 33 మంది, ఇస్లామాబాద్ నుంచి 10 మంది ఉన్నారు.
కాగా పాకిస్థాన్ రక్షణ మంత్రి ఖవాజా ఆసీఫ్ ఏప్రిల్ 19న సియాల్కోట్లో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో యాచన ఓ పెద్ద సమస్యగా మారిందన్నారు. దీనివల్ల ఇతర దేశాలు వీసాలు జారీ చేయడంలేదని చెప్పారు. దేశంలో దాదాపు 2 కోట్ల మంది యాచకులు ఉన్నట్లు తెలిపారు. వారి నెలవారీ ఆదాయం 4,200 కోట్ల పాకిస్థానీ రూపాయిలని ఆయన వెల్లడించారు. సియాల్ కోట్ నుంచి వారిని రెండుసార్లు తరిమేస్తే మళ్లీ తిరిగొచ్చారన్నారు.
అదేవిధంగా 2023లో పాకిస్థాన్ సెనెట్ ప్యానెల్ ముందు నాటి ఓవర్సీస్ మినిస్ట్రీ సెక్రెటరీ జుల్ఫికర్ హైదర్ మాట్లాడుతూ.. విదేశాల్లో అరెస్టవుతున్న 90 శాతం బిచ్చగాళ్లు పాకిస్థాన్‌కు చెందినవారని అన్నారు. చాలామంది యాత్రికుల వీసాలను తీసుకొని సౌదీ, ఇరాన్, ఇరాక్ లాంటి దేశాలకు వెళ్తున్నారని, అక్కడ భిక్షాటన చేస్తూ గడుపుతున్నారని చెప్పారు. వారికి ఇప్పుడు జపాన్ కొత్త కేంద్రంగా మారుతోందని తెలిపారు.