Gaza | హమాస్ (Hamas) అంతమే లక్ష్యంగా గాజా స్ట్రిప్‌పై ఇజ్రాయెల్ (Israel) భీకర దాడులకు పాల్పడుతోంది. డ్రోన్లు, వైమానిక దాడులతో విరుచుకుపడుతోంది. తాజాగా శుక్రవారం కూడా గాజాలోని పలు ప్రాంతాలపై ఐడీఎఫ్ (IDF) దళాలు విరుచుకుపడ్డాయి. ఈ దాడుల్లో 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు.
గాజా నగరంలోని ఉత్తర ప్రాంతంపై ఐడీఎఫ్ కాల్పులు జరిపింది. ఈ దాడిలో 65 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో ఒకే కుటుంబానికి చెందిన 14 మంది ఉన్నట్లు వైద్య వర్గాలు తెలిపాయి. గాజా నగరంలో అట్ ట్వామ్ ప్రాంతంలో (at-Twam area)ని ఇంటిపై జరిపిన దాడిలో వారంతా మరణించినట్లు పేర్కొన్నాయి. అయితే, ఈ దాడులను పాలస్తీనా గ్రూప్ హమాస్ ఖండించింది. పౌరులను లక్ష్యంగా చేసుకోవడం ద్వారా ఇజ్రాయెల్ యుద్ధ నేరాలకు పాల్పడుతోందని ఆరోపించింది. ఇలాంటి చర్యలు అంతర్జాతీయ చట్టాన్ని ఉల్లంఘించడమేనని పేర్కొంది.
హమాస్, ఇజ్రాయెల్ దాడులు (Israel Hamas War) రెండేండ్లుగా కొనసాగుతూనే ఉన్నాయి. 2023, అక్టోబర్ 7న ఇజ్రాయెల్ సరిహద్దుల్లోని హమాస్ దాడికి పాల్పడింది. దీంతో 1200 మంది ఇజ్రాయెల్ పౌరులు చనిపోయారు. మరో 251 మందిని బందీలుగా హమాస్ పట్టుకెళ్లింది. ప్రతిగా గాజాపై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడుతున్నది. హమాస్ తుదముట్టించే వరకు గాజాపై దాడులు చేస్తామంటూ ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇందులో భాగంగా గాజా స్ట్రిప్‌పై భీకర దాడులు చేపడుతోంది. ఇక ఈ దాడుల్లో ఇప్పటివరకు 64 వేల మందికిపైగా పాలస్తీనియన్లు (Palestinians) మృతిచెందారు. యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి 64,231 మంది పాలస్తీనియన్లు మరణించినట్లు గాజా ఆరోగ్య శాఖ వెల్లడించింది. మరో 400 మందికిపైగా ఆచూకీలేకుండా పోయారని తెలిపింది. మృతుల్లో సగానికిపైగా మహిళలు, చిన్నారులు ఉన్నారని పేర్కొంది.
Also Read..
Boat Accidents | పెను విషాదం.. బోటు ప్రమాదాల్లో 200 మంది మృతి
Japan: జపాన్‌లో కొత్త రికార్డు.. లక్షకు చేరిన 100 ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య
PM Modi | నేపాల్ తాత్కాలిక ప్రధాని సుశీల కర్కికి మోదీ శుభాకాంక్షలు