టోక్యో: జపాన్(Japan) కొత్త రికార్డు క్రియేట్ చేసింది. ఆ దేశంలో వంద ఏళ్లు దాటిన వృద్ధుల సంఖ్య లక్ష దాటినట్లు ప్రభుత్వం వెల్లడించింది. వరుసగా 55వ సంవత్సరం ఆ దేశం కొత్త రికార్డును నమోదు చేసింది. సెప్టెంబర్లో శతాధిక వృద్ధుల సంఖ్య 99,763 మందికి చేరుకున్నట్లు ఆరోగ్యశాఖ మంత్రి శుక్రవారం వెల్లడించారు. అయితే దీంట్లో 88 శాతం మంది మహిళలే ఉండడం గమనార్హం.
అత్యధిక కాలం జీవిస్తున్న వారి సంఖ్య జపాన్లో అధికం. ఆ లిస్టులో జపాన్ టాప్లో ఉంటుంది. ప్రపంచంలోని అత్యంత వృద్ధ వ్యక్తి ఆ దేశంలో జీవిస్తున్నట్లు రికార్డులు ఉన్నాయి. చాలా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం వల్ల జపాన్ ప్రజలు ఎక్కువ కాలం జీవిస్తున్నారు. కానీ అక్కడ జనన రేటు తక్కువగా ఉన్నది.
జపాన్ నివేదికల ప్రకారం.. ఆదేశంలో జీవిస్తున్న అత్యంత వృద్ధ వ్యక్తి వయసు 114 ఏళ్లు. యమటోకరియామాకు చెందిన ఆ మహిళను షిగికో కగ్వాగా గుర్తించారు. నారా సిటీకి శివారు ప్రాంతంలో ఇది ఉన్నది. జపాన్ లెక్కల ప్రకారం అత్యంత వృద్ధ మగ వ్యక్తిని కియోటకా మిజునోగా గుర్తించారు. ఆయన వయసు 111 ఏళ్లు. ఇవాటా అతని స్వస్థలం.
ఆరోగ్యశాఖ మంత్రి తకమారో పుఖోకా ఈ నేపథ్యంలో వృద్ధులకు కంగ్రాట్స్ చెప్పారు. 87,784 మంది మహిళలు, 11,979 మంది వృద్ధ పురుష జనాభా ఉన్నట్లు మంత్రి తెలిపారు.సమాజ అభివృద్ధికి సహకరించిన వారికి ధన్యవాదులు చెబతున్నట్లు వెల్లడించారు. జపాన్లో సెప్టెంబర్ 15వ తేదీన వృద్ధ దినోత్సవం జరుపుతున్నారు. ఈ సందర్భంగా ప్రధాని నుంచి ఆ వృద్ధులకు ఓ లేఖ, సిల్వర్ కప్ అందిస్తారు. ఈ ఏడాది 52,310 మంది పురస్కారానికి ఎంపికయ్యారు.
1963లో శతాధిక వృద్ధులను లెక్కింపు చేయడం మొదలుపెట్టారు. ఆ సమయంలో 153 మంది వందేళ్లు దాటిన వాళ్లు ఉన్నారు. 1981లో ఆ సంఖ్య వెయ్యి దాటింది. 1998 నాటికి ఆ సంఖ్య పది వేలకు చేరుకున్నది. జపాన్లో ఓబెసిటీ కేసులు తక్కువ. రెడ్ మీట్ తక్కువగా తింటారు. ఎక్కువగా చేపలు, కూరగాయలు తింటారు. జపాన్ మహిళల్లో ఓబెసిటీ కేసులు మరీ మరీ తక్కువ. దాని వల్లే అక్కడ మహిళల్లో జీవిత కాలం ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. మిగితా ప్రపంచ దేశాలన్నీ తమ డైయిట్లో షుగర్, ఉప్పుకు అధిక ప్రాధాన్యత ఇవ్వగా.. జపాన్ మాత్రం భిన్నంగా ముందుకెళ్లింది. ఉప్పును తగ్గించి తీసుకోవాలని జపాన్లో ప్రచారం చేశారు. కేవలం ఆహారం మాత్రమే కాదు.. జీవితంలో యాక్టివ్గా ఉండేందు.. ఎక్కువగా వాకింగ్ చేస్తారు. ప్రజా రవాణా వ్యవస్థ మీద ఎక్కువగా ఆధారపడుతారు. రేడియో తైసో అనే ఓ గ్రూపు ఎక్సర్సైజ్ను దేశం మొత్తం ఓ మూడు నిమిషాల పాటు ప్రసారం చేస్తారు. ఆ సమయంలో ప్రజలు ఈ గ్రూపు యాక్టివిటీలో పాల్గొంటారు.
జపాన్ వృద్ధ జనాభా లెక్కల్లో కొంత అవకతవకలు ఉన్నట్లు కొందరు ఆరోపిస్తున్నారు. ఫ్యామిలీ రిజిస్ట్రీల ప్రకారం జపాన్లో 2010 నాటికే సుమారు రెండున్నర లక్షల మంది శతాధిక వృద్ధులు ఉంటారని అంచనా వేస్తున్నారు. కానీ వాళ్లు పెన్షన్ కోసం తప్పుడు లెక్కలు చూపి ఉంటారని కొందరు భావిస్తున్నారు.