Israel vs Iran : ఇజ్రాయెల్-ఇరాన్ (Israel vs Iran) దేశాల మధ్య గత 12 రోజులుగా జరుగుతున్న యుద్ధంతో పశ్చిమాసియా అల్లకల్లోలంగా మారింది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. అయితే ఒప్పందం కుదిరిన కొన్ని గంటలకే టెహ్రాన్ (Tehran) ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని, తమపై క్షిపణులతో దాడులకు దిగిందని టెల్అవీవ్ (Tel Aviv) ఆరోపిస్తోంది. ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌కు గట్టిగా బదులిస్తామని హెచ్చరించింది.
కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన రెండు గంటలకే తమ గగనతలంపైకి ఇరాన్ నుంచి రెండు బాలిస్టిక్ క్షిపణులు దూసుకొచ్చాయని ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. ఈ నేపథ్యంలో ఉత్తర ఇజ్రాయెల్‌లో సైరన్లు మోగాయని, ఆయా ప్రాంతాల ప్రజలు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు సురక్షిత ప్రాంతాల్లోనే ఉండాలని ఆదేశాలు వెళ్లాయని వెల్లడించింది.
కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించిన ఇరాన్‌పై గట్టిగా స్పందించాలని తాను ఐడీఎఫ్‌ను ఆదేశించానని ఇజ్రాయెల్ రక్షణ మంత్రి కాట్జ్ తెలిపారు. టెహ్రాన్‌లోని అతి ముఖ్యమైన ప్రాంతాలే లక్ష్యంగా దాడులు చేయాలని సూచించినట్లు వెల్లడించారు. తమ వైమానిక దళాన్ని, సైన్యాన్ని అప్రమత్తంగా ఉండాలని హెచ్చరికలు జారీ చేసినట్లు చెప్పారు.
ఇరాన్- ఇజ్రాయెల్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరగనుందని తొలుత అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఆ తర్వాత ఇరాన్ దీనిపై స్పందించిన తీరు గందరగోళానికి దారితీసింది. ఇంకా కాల్పుల విరమణ ఒప్పందం చేసుకోలేదని చెబుతూనే.. సైనిక కార్యకలాపాలు ముగిశాయని అర్థం వచ్చేలా పేర్కొంది. తర్వాత ఇరుదేశాల మధ్య దాడులు జరిగాయి. ఆ వెంటనే కాల్పుల విరమణ అమల్లోకి వచ్చిందని ఇరాన్ ప్రకటించింది. ఇజ్రాయెల్ కూడా ట్రంప్ ప్రతిపాదనను అంగీకరించినట్లు తెలిపింది.