Bird’s Nest | ప్రకృతి మనకు అన్ని ఇస్తుంది. అందుకే ఒక ఆంగ్ల కవి విలియం వర్డ్స్ వర్త్ ప్రకృతి గూర్చి ఇలా అన్నాడు. ప్రకృతి ఒక టీచర్, ఒక ఇంజినీర్, ఒక డాక్టర్, ఒక సైంటిస్ట్, ఒక దైవంగా చెప్పాడు. ఈ సృష్టిలో అంతులేని సంపద దాగి ఉంది. సంపద అంటే ధనం మాత్రమే కాదు భూమిలో ఉన్న బంగారం, బొగ్గు, చమురు నిల్వలు మొదలైనవి. మానవుడు నాగరికత ప్రపంచంలోకి వచ్చాక అన్నింటిపై క్షుణ్ణంగా తెలుసుకోవడం మొదలు పెట్టాడు. భూగోళం, ఖగోళం మాత్రమే కాకుండా అణువు, పరమాణువును సృష్టించి అణు రియాక్టర్లను సైతం పదిలపరిచే వరకు వెళ్లాడు.
ఈ ఉపోద్ఘాతం అంతా ఎందుకంటే ప్రకృతిలో గిజిగాడు అనేది ఒక రకమైన పిచ్చుక. ఆడ పక్షి గూటిలో పిల్లలకు (Bird’s Nest) ఆహారం ముక్కుతో అందిస్తే, మగ పక్షి గూడు అల్లుతుంది. చెరువులు, కుంటలు, వాగులు, వంకలు, వ్యవసాయ బావుల్లో ఏపుగా ఉన్న తుమ్మ చెట్ల కొమ్మలకు ఈ పక్షి గూడు కడుతుంది. ఇప్పుడున్న ఇంజనీర్ల మతి భ్రమించేలా ఈ గూళ్ల నిర్మాణం ఉంటుంది. ఒక్కొక్క గడ్డి పోచను ముక్కుతో తీసుకు వచ్చి పకడ్బందీగా గూడు నిర్మిస్తుంది. మనుషుల వలెనే గీజుగాడు పక్షులన్నీ ఒక వద్దనే గూళ్లు నిర్మించుకుంటాయి. గాలి బాగా వీస్తే గూళ్లు తెగి బావిలో పడుతుంది అనే విధంగా ఈ గూళ్లు ఉంటాయి. బలమైన గాలి మాత్రమే కాదు వర్షం పడిన గూటిలో ఉన్న పిల్లలు తడవకుండా ఈ పక్షులు గూళ్లు నిర్మిస్తాయి.
కొమ్మలకు వేలాడుతున్న ఈ గూళ్ళను నిర్మించిన సాంకేతిక నైపుణ్యం అబ్బురపరుస్తుంది. వ్యవసాయ బావుల్లో మాత్రమే కాదు విద్యుత్ తీగలకు కూడా ఈ గూళ్లు ఉండటం మనం చూస్తూ ఉంటాం. పాములు, కాకులు వంటివి గూడులో దాగి ఉన్న పక్షి గుడ్లను తినకుండా ఈ నిర్మాణం ఉంటుంది. శత్రువుల సవ్వడి వినిపిస్తే మూకుమ్మడిగా ఈ పిచ్చుకలు ఎగిరిపోతాయి. అలికిడి పోయాక మళ్ళీ గూళ్లుకు తిరిగి వస్తాయి. మగ పిచ్చుక తల మీద స్వర్ణ కిరీటంలా పసుపు రంగు వర్ణం, రెక్కలు గోధుమ, నలుపు రంగు చారలతో కనిపిస్తాయి. ఆడ పిచ్చుకకు తలమీద పసుపు రంగు, ముఖం మీద నలుపు రంగు వంటి చారలు ఉండవు. మగ పిచ్చుక గూడు నిర్మించిన తరువాత తన నైపుణ్యం చూడమంటూ కిలకిల రావాలతో రెక్కలు ఆడిస్తూ గూడు చుట్టూ తిరుగుతూ ఉంటుంది. ప్రకృతి ప్రసాదించిన ఈ గీజుగాడు పిచ్చుక కంటే పెద్ద ఇంజినీర్ ఈ సృష్టిలో ఎవరుంటారు కదా..
-గుడికందుల కిషోర్, హనుమకొండ జిల్లా, భీమదేవరపల్లి మండలం.