PM Netanyahu : ఒకపక్క ఇరాన్‌తో యుద్ధం, లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడులు చేస్తున్న ఈ తరుణంలో ఆ దేశ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ఆస్పత్రిలో చేరడం సంచలనం కలిగిస్తోంది. ఆయనకు ఏమైంది అంటూ అటు ఇజ్రాయెల్ ప్రజలతోపాటు ఇతర దేశాలు కూడా ఆసక్తిగా గమనిస్తున్నాయి. ఈ అంశంపై ఇజ్రాయెల్ ప్రధాని కార్యాలయం స్పందించింది. ఆయనకు తీవ్ర అనారోగ్య సమస్య ఏమీ లేదని వెల్లడించింది. నెతన్యాహు కార్యాలయం తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన జెరూసలెంలోని హదస్సా ఈన్ కెరెమ్ మెడికల్ సెంటర్లో చికిత్స కోసం వెళ్లారు.
అయితే, కేవలం దంతాలకు సంబంధించిన సమస్యతోనే ఆయన బాధపడుతున్నారని, దానికి చికిత్స కోసమే ఆస్పత్రికి వెళ్లారని ప్రధాని కార్యాలయం తెలిపింది. కానీ, అది ఎలాంటి దంతాల సమస్య అని మాత్రం వెల్లడించలేదు. ప్రస్తుతం నెతన్యాహు ఇంకా వైద్యుల పర్యవేక్షణలోనే ఉన్నట్లు తెలుస్తోంది. నెతన్యాహు వయసు 76 ఏళ్లు. అందువల్ల ఆయనకు వయసు సంబంధిత సమస్యలు ఏమైనా వచ్చాయా అని అభిమానులు ఆరా తీస్తున్నారు. కొంతకాలంగా ఆయన అనారోగ్యంపై ఇజ్రాయెల్‌లో ప్రచారం జరుగుతోంది. ఆయన దీర్ఘకాలిక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని అక్కడి మీడియా ప్రచారం. గత నెలలో ఈ అంశంపై ఆయన ఒక ప్రకటన చేశారు.
ఇదే ఆస్పత్రిలో ప్రొస్టేట్ కణితికి సంబంధించి రేడియేషన్ చికిత్స తీసుకున్నట్లు ఆయన వెల్లడించారు. ఈ చికిత్స విజయవంతమైందన్నారు. కావాలనే తన దేశ ప్రజలకు తెలియకుండా ఈ విషయాన్ని దాచిపెట్టానన్నారు. ఈ సమాచారాన్ని అడ్డం పెట్టుకుని ఇరాన్ తప్పుడు ప్రచారానికి పూనుకుంటుందనే ఉద్దేశంతోనే తన అనారోగ్యాన్ని వెల్లడించలేదన్నారు. ఇరాన్ యుద్ధం సమయంలో దీన్ని వెల్లడించడం సరికాదని భావించినట్లు చెప్పారు. అయితే, తనకు కచ్చితంగా ఏమైంది అనే విషయాన్ని, చికిత్స పూర్తైందా లేదా అనే విషయాల్ని మాత్రం నెతన్యాహు వెల్లడించలేదు.
ఆయనకు క్యాన్సర్ సోకిందని, దీనికి చికిత్స తీసుకుంటున్నారని అప్పట్లో ఒక ప్రకటన వెలువడింది. 2023లో ఆయన చికిత్స కోసం షెబా మెడికల్ సెంటర్‌కు వెళ్లినప్పటి నుంచి నెతన్యాహు అనారోగ్యంపై ఇలా రకరకాల ప్రచారాలు జరుగుతూనే ఉన్నాయి. మరోవైపు.. మిడిల్ ఈస్ట్ సంక్షోభానికి సంబంధించి లెబనాన్‌పై ఇజ్రాయెల్ తాజాగా దాడులకు దిగింది. రెండు దేశాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతూనే ఉన్నాయి.