దుబాయ్, జూన్ 17: ఇరాన్, ఇజ్రాయెల్ యుద్ధం రోజురోజుకూ ముదురుతున్నది. ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ మంగళవారం విరుచుకుపడింది. ఈ దాడుల్లో ఇరాన్ చీఫ్ ఆఫ్ స్టాఫ్, సీనియర్ సైనిక కమాండర్ మేజర్ జనరల్ అలీ షాద్మానీని అంతం చేసినట్లు ఇజ్రాయెలీ సైన్యం మంగళవారం ప్రకటించింది. ఇరాన్ సుప్రీం నాయకుడు అయాతొల్లా అలీ ఖమేనీకి అత్యంత సన్నిహితుడు, ఎమర్జెన్సీ కమాండ్ సెంట్రల్ హెడ్‌క్వార్టర్స్‌కి అధిపతిగా ఉన్న షాద్మానీ ఇస్లామిక్ రివల్యూషరీ గార్డ్ కోర్‌తోపాటు సాయుధ దళాలకు కూడా సారథ్యం వహిస్తున్నట్లు తెలిపింది.
నాలుగు రోజుల క్రితమే షాద్మానీ బాధ్యతలు చేపట్టినట్టు పేర్కొన్నది. ఇజ్రాయెల్ దాడులతో టెహ్రాన్‌లో దుకాణాలు మూతపడగా వాహనాలకు అవసరమైన ఇంధనం గ్యాస్ కోసం ప్రజలు గ్యాస్ స్టేషన్ల వద్ద బారులు తీరారు. డౌన్‌టౌన్ టెహ్రాన్‌లో మంగళవారం ఉదయం ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవడం కనిపించింది. అనేక దుకాణాలు మూతపడ్డాయి. పురాతన గ్రాండ్ బజార్ కూడా మూతపడింది. టెహ్రాన్ నగరం నుంచి పశ్చిమ దిశగా తమ వాహనాలలో పయనమవుతున్న వేలాది మందితో రోడ్లు కిక్కిరిసిపోయాయి.
ఇరాన్లో అత్యంత రహస్యంగా, సురక్షితంగా నిర్వహిస్తున్న అణు స్థావరం నటాంజ్ న్యూక్లియర్ కాంప్లెక్స్‌పై ఇజ్రాయెల్ అత్యంత కచ్చితత్వంతో దాడులు నిర్వహించింది. భూగర్భంలో అత్యంత లోతులో ఉన్న నటాంజ్ న్యూక్లియర్ కాంప్లెక్స్‌పై ఇజ్రాయెల్ క్షిపణులు దాడి చేసినట్లు ఐక్య రాజ్య సమితికి చెందిన అంతర్జాతీయ అణు ఇంధన సంస్థ(ఐఏఈఏ) మంగళవారం వెల్లడించింది. భూమి లోపల ఎంతో లోతులో నిర్మించిన ఈ స్థావరాన్ని ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకోవడం ఇజ్రాయెల్‌కు సాధ్యం కాదని గతంలో అనేక దేశాలు భావించాయి. నటాంజ్ యురేనియం శుద్ధి కర్మాగారంలోని భూగర్భ విభాగాన్ని ఇజ్రాయెల్ నేరుగా కొట్టినట్లు తమ వద్ద సమాచారం ఉందని ఐఏఈఏ తెలిపింది.
ఇరాన్ రాజధాని టెహరాన్ నగర నడిబొడ్డున నివసిస్తున్న దాదాపు 3.30 లక్షల మందిని ఖాళీ చేయాలని ఇజ్రాయెలీ సైన్యం అంతకుముందు పిలుపునిచ్చింది. పశ్చిమాసియాలో అతి పెద్ద నగరాలలో ఒకటైన టెహ్రాన్‌లో దాదాపు కోటి మంది నివసిస్తున్నారు. ఇజ్రాయెల్ జనాభాకు ఇది దాదాపు సరిసమానం.
ఇరాన్ అణు కేంద్రాలపై దాడులు చేసేందుకు తమకు ‘14వేల కిలోల బంకర్ బస్టర్’ బాంబులను ఇవ్వాలని అమెరికాను ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కోరినట్టు సమాచారం. ఇరాన్ అణు కేంద్రాలను ఇజ్రాయెల్ టార్గెట్ చేయగా, ఫోర్డో అణు శుద్ధి కర్మాగారాన్ని మాత్ర ధ్వంసం చేయలేకపోయింది. పర్వతప్రాంతాల్లో భూగర్భంలో నిర్మించిన ఈ అణు కేంద్రాన్ని ధ్వంసం చేసేందుకు బంకర్ బస్టర్‌ను వాడాలని ఇజ్రాయెల్ భావిస్తున్నది. అమెరికా వద్ద ఉన్న ఈ బాంబ్‌ను ‘ఎంవోపీ’గా పిలుస్తారు. ఇది 200 అడుగుల బలమైన శిలను తుత్తునియలు చేయగలదు.
ఇజ్రాయెల్ నిఘా సంస్థ మొస్సాద్ ప్రధాన కార్యాలయంపై ఇరాన్ మంగళవారం దాడి జరిపినట్లు ఇరాన్‌కు చెందిన ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డు కోర్(ఐఆర్జీసీ) వెల్లడించింది. అంతేగాకుండా గ్లిలాట్లోని ఇజ్రాయెల్ మిలిటరీ ఇంటెలిజెన్స్ కాంప్లెక్స్‌పై దాడి చేసినట్టు ప్రకటించింది. అలాగే టెహ్రాన్‌లో ఇజ్రాయెల్ గూఢచార సంస్థ మొస్సాద్ నిర్వహిస్తున్న డ్రోన్ల ఫ్యాక్టరీని కూడా ఇరాన్ ధ్వంసం చేసింది.