టెహ్రాన్: పశ్చిమాసియాలో యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. ఇజ్రాయెల్ (Israel) వైమానిక దళం ఇరాన్‌పై (Iran) ముందస్తు దాడులకు దిగింది. అణు కర్మాగారాలు, సైనిక స్థావరాలే లక్ష్యంగా టెహ్రాన్‌పై బాంబుల వర్షం కురిపించింది. శుక్రవారం ఉదయం దేశ రాజధానిలో పేలుళ్ల శబ్ధం వినిపించడంతో స్థానికులు భయాందోళలనలకు గురయ్యారని ఇరాన్ అధికార మీడియా వెల్లడించింది. అయితే ఇజ్రాయెల్ దాడులను తిప్పికొట్టేందుకు ఇరాన్ సైన్యం పూర్తిస్థాయిలో సంసిద్ధంగా ఉందని పేర్కొంది.
ఇరాన్ అణు స్థావరాలే లక్ష్యంగా దాడి చేశామని ఇజ్రాయెల్ వెల్లడించింది. టెహ్రాన్ ప్రతిదాడులు చేసే అవకాశం ఉండటంతో దేశంలో అత్యవసర పరిస్థితులను ప్రకిటించింది. తమ ఆపరేషన్ నేపథ్యంలో ఇరాన్ కూడా డ్రోన్లు, క్షిపణులతో ప్రతిదాడులకు దిగే అవకాశం ఉందని ఇజ్రాయెల్ రక్షణ మంది కాట్జ్ తెలిపారు.
కాగా, ‘అది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం కావచ్చు. మా సైనిక కుటుంబాలను, దౌత్య సిబ్బందిని అక్కడి నుంచి తరలిస్తున్నాం. ఆ ప్రాంతాన్ని వీడాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. ఇకపై ఏం జరుగుతుందో చూడాలి’ అంటూ పశ్చిమాసియాను ఉద్దేశించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యానించిన కొన్ని గంటల వ్యవధిలోనే టెహ్రాన్‌పై ఇజ్రాయెల్ వైమానికి దాడులకు దిగడం గమనార్హం.
మాపై దాడి చేస్తే, అమెరికా స్థావరాలపై ప్రతిదాడి చేస్తాం..
ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమంపై చర్చలు విఫలమైతే ఆ దేశంపై దాడి చేస్తామని ట్రంప్ పలుమార్లు బెదిరించారు. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. తమపై దాడులు జరిగితే ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ప్రతీకార దాడులకు దిగుతామని ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్జాదేహ్ పేర్కొన్నారు. ఇరాక్, కువైట్, ఖతర్, బహ్రెయిన్, దుబాయ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలున్నాయి. ఇదిలా ఉండగా వచ్చే ఆదివారం ఇరాన్, అమెరికా మధ్య ఆరో దఫా చర్చలు జరుగుతాయని ఒమన్ విదేశాంగ మంత్రి చెప్పారు. కాగా, తమ అణు కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తే లేదని, ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా అది కొనసాగుతుందని చర్చలు జరుపుతున్న ఇరాన్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.