వాషింగ్టన్, జూన్ 12 : ఇరాన్‌పై దాడికి ఇజ్రాయెల్ సిద్ధమవుతున్నట్టు పశ్చిమాసియాలో చోటుచేసుకుంటున్న తాజా పరిణామాలను బట్టి తెలుస్తున్నది. ఇరాన్‌తో అణు ఒప్పందంపై అమెరికా జరుపుతున్న చర్చలు విఫలమైన నేపథ్యంలో ఆ దేశ అణు స్థావరాలపై ఇజ్రాయెల్ దాడులకు సిద్ధమవుతున్నట్టు కథనాలు వెలువడుతున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. పశ్చిమాసియాను ఉద్దేశించి ఆయన ‘అది అత్యంత ప్రమాదకరమైన ప్రదేశం కావచ్చు. మా సైనిక కుటుంబాలను, దౌత్య సిబ్బందిని అక్కడి నుంచి తరలిస్తున్నాం. ఆ ప్రాంతాన్ని వీడాలని ఇప్పటికే నోటీసులు ఇచ్చాం. ఇకపై ఏం జరుగుతుందో చూడాలి’ అని వ్యాఖ్యానించారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలను తగ్గించడానికి ఏదైనా మార్గం ఉందా అని మీడియా ప్రశ్నించగా ‘వారు (ఇరాన్) అణ్వాయుధాలు కలిగి ఉండకూడదు. అంతే!’ అని అన్నారు.
తాజా పరిణామాల నేపథ్యంలో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరిగాయి. దీంతో ఇరాక్‌లోని దౌత్య కార్యాలయం నుంచి కూడా అమెరికా తన సైనిక కుటుంబాలను, ఇతర సిబ్బందిని తరలిస్తున్నట్టు రాయిటర్స్ వార్తా సంస్థ తెలిపింది. భద్రతాపరమైన ముప్పు ఎటువంటిదో తెలుపకుండానే అమెరికా తన సిబ్బందిని తరలిస్తున్నదని, దీంతో చమురు ధరలు నాలుగు శాతం పెరిగాయని ఇరాకీ వర్గాలు పేర్కొన్నాయి. బహ్రెయిన్, కువైట్‌లోని తమ సిబ్బంది అక్కడే ఉండాలా లేక తరలిపోవాలా అన్నది వారి నిర్ణయానికే వదిలేశామని అమెరికా విదేశాంగ శాఖ అధికారి ఒకరు చెప్పారు. ఇజ్రాయెల్‌లో ఉంటున్న తమ దౌత్య సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు టెల్అవీవ్ నగరం దాటి వెళ్లవద్దని అమెరికా ఒక ప్రకటనలో సూచించింది. క్షిపణి, మోర్టార్, రాకెట్ లేదా డ్రోన్ల ద్వారా దాడులు జరిగితే ఎక్కడ దాక్కోవాలో అవగాహన కలిగి ఉండాలని పేర్కొంది. పశ్చిమాసియాలో అమెరికన్ల భద్రత వాతావరణం అత్యంత సంక్లిష్టంగా ఉందని, అది ఏ క్షణమైనా మారిపోవచ్చునని హెచ్చరికలు జారీ చేసింది.
ఇరాన్ అణ్వాయుధ కార్యక్రమంపై చర్చలు విఫలమైతే ఆ దేశంపై దాడి చేస్తామని ట్రంప్ పలుమార్లు బెదిరించారు. మరోవైపు ఇరాన్ కూడా అమెరికా దాడులను ఎదుర్కొనేందుకు సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. తమపై దాడులు జరిగితే ఈ ప్రాంతంలోని అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకొని ప్రతీకార దాడులకు దిగుతామని ఇరాన్ రక్షణ మంత్రి అజీజ్ నసీర్జాదేహ్ పేర్కొన్నారు. ఇరాక్, కువైట్, ఖతర్, బహ్రెయిన్, దుబాయ్ దేశాల్లో అమెరికా సైనిక స్థావరాలున్నాయి. ఇదిలా ఉండగా వచ్చే ఆదివారం ఇరాన్, అమెరికా మధ్య ఆరో దఫా చర్చలు జరుగుతాయని ఒమన్ విదేశాంగ మంత్రి చెప్పారు. కాగా, తమ అణు కార్యక్రమాన్ని ఆపే ప్రసక్తే లేదని, ఒప్పందం కుదిరినా, కుదరకపోయినా అది కొనసాగుతుందని చర్చలు జరుపుతున్న ఇరాన్ ప్రతినిధులు స్పష్టం చేస్తున్నారు.