Iran : అంతర్యుద్ధంతో అట్టుడుకుతున్న ఇరాన్ లో పౌరుల ప్రాణాలు వేల సంఖ్యలో గాలిలో కలిసిపోతున్నాయి. గత మూడు వారాలుగా జరుగుతున్న ఘర్షణల్లో దాదాపు 16,500 మందికి పైగా ప్రజలు మరణించినట్లు తాజా నివేదిక తెలియజేసింది. అంతేకాదు.. 3,30,000 మందికిపైగా ఈ ఘర్షణల్లో గాయపడ్డారు. డిసెంబర్ చివరి వారంలో ఇరాన్ లో ఘర్షణలు మొదలయ్యాయి. అక్కడ ఆర్థిక పరిస్తితి దిగజారడం, నిత్యావసరాల ధరలు పెరగడం, మరోవైపు తీవ్రమైన ఆంక్షలను వ్యతిరేకిస్తూ ప్రజలు నిరసనలు మొదలెట్టారు.
ఈ సందర్భంగా నిరసనకారుల్ని అణచివేసేందుకు ప్రభుత్వం తీవ్ర చర్యలకు దిగింది. కాల్పులు, శిక్షలతో వేలాదిమంది ప్రాణాలు తీసింది. ఈ విషయాన్ని శనివారం ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీ కూడా ధృవీకరించాడు. ఇరాన్లో జరుగుతున్న నిరంతరం ఘర్షణల్లో వేలాది మంది ప్రాణాలు కోల్పోయారని ఖమేనీ చెప్పాడు. ఈ ఘర్షణల్ని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ రెచ్చగొట్టాడని, అతడొక క్రిమినల్ అని ఖమేనీ అన్నాడు. ఈ ఘర్షణల్లో ఎంతమంది మరణించారనేది అధికారికంగా వెల్లడికాకపోయినా.. 16,500 నుంచి 18,000 మంది వరకు మరణించి ఉంటారని, 3,30,000 మంది నుంచి 3,60,000 మంది వరకు గాయపడ్డారని అంతర్జాతీయ మీడియా సంస్థలు పేర్కొంటున్నాయి. వీరిలో గర్భిణులు సహా మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు. వీరిలో ఎక్కువ మంది 30 ఏళ్లలోపు వారే. చాలా మంది ఆందోళనకారుల తలపై కాల్చడం వల్లే మరణిస్తున్నారు. అలాగే 700 నుంచి 1,000 మంది వరకు కంటి చూపు కోల్పోయారు.
టెహ్రాన్ లోని ఒక కంటి ఆస్పత్రిలో ఇటీవలి కాలంలోనే 7,000 మందికిపైగా కంటి జబ్బులతో చికిత్స తీసుకున్నారు. ఆందోళనకారుల్ని అదుపు చేసేందుకు ప్రమాదకరమైన ఆయుధాల్ని వాడటం వల్ల ప్రజలు తీవ్రంగా గాయపడుతున్నారు. కళ్లు, మెడ, ఛాతి వంటి భాగాల్లో తీవ్ర గాయాలవుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. గాయాలపాలైన చాలా మందికిసరిపడా రక్త సరఫరా లేకపోవడం వల్ల కూడా క వందలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. రోగుల్ని కాపాడేందుకు వైద్య సిబ్బందే రక్తం దానం చేయాల్సిన పరిస్తితి ఉంది. ఇరాన్లో జరుగుతున్న ఈ మారణహోమంపై అమెరికా సహా పలు దేశాలు ఆందోళనవ్యక్తం చేస్తున్నాయి.