టెహ్రాన్, జూన్ 22: ఇజ్రాయెల్-ఇరాన్ యుద్ధం మరింత తీవ్ర రూపం దాల్చిన వేళ, విదేశాల్లో నివసిస్తున్న ఇరానియన్లు ఫోన్ కాల్స్ చేసుకోవటంలో ఆటంకాలు ఏర్పడ్డాయి. స్వదేశంలో (ఇరాన్) ఉన్న తమ స్నేహితులు, బంధువులకు ఫోన్ కాల్స్ చేయగా, వింతైన, విచిత్రమైన రోబోటిక్ సందేశాలతో అంతరాయాలు ఏర్పడ్డాయి. ‘కండ్లు మూసుకొని శాంతి, సంతోషం అందించే వాతావరణంలో తమను తాము చూసుకోవాలి’ అంటూ 90 సెకన్లపాటు ఆ సందేశం వెలువడింది.
కొన్ని సందర్భాల్లో, ‘హలో!హలో! ఎవరు కాల్ చేస్తున్నారు? నేను మీ మాట వినలేకపోతున్నా. మీరు ఎవరో నాకు తెలియదు’ అని చెప్పే ఆటోమేటెడ్ వాయిస్‌తో ఫోన్ కాల్స్ నిలిచిపోయాయి. భద్రతా పరమైన కారణాలతో ఇరాన్ గత బుధవారం ఇంటర్నెట్పై నియంత్రణలు విధించింది. దీంతో విదేశాల్లోని ఇరానియన్లు వాట్సాప్ కాకుండా, ప్రత్యక్ష ఫోన్ కాల్స్‌ను ఆశ్రయించాల్సి వచ్చింది.
ఇలాంటి ఫోన్ కాల్స్‌కు వింతైన, ఆటోమేటెడ్ వాయిస్ సందేశాలు వెలువడినట్టు తెలిసింది. ల్యాండ్‌లైన్ ద్వారా ఫోన్ కాల్స్ చేసిన వారికి ఈ పరిస్థితి ఎదురుకాలేదు. యుద్ధ సంక్షోభం ఉధృతంగా మారిన వేళ, ఫోన్ కాలింగ్‌లో తమకు ఎదురైన అనుభవం ఇరానియన్లను విస్మయానికి గురిచేసింది. కొంతమంది సైబర్ దాడి, మరికొంత మంది టెక్నికల్ లోపంగా భావించారు.