Iran Israel War | ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు తీవ్రంగా స్పందించారు. ఇరాన్ భారీ తప్పిదానికి పాల్పడిందని ఆయన అన్నారు. దీనికి ఇరాన్ తగిన మూల్యం చెల్లించుకుంటుందని హెచ్చరించారు. ఇరాన్‌లోని నిరంకుశ పాలనను అంతం చేసి ప్రజలకు స్వేచ్ఛ కల్పిస్తామని ప్రకటించారు.
ఇరాన్ క్షిపణుల దాడి తర్వాత జెరూసలెంలో అధికారులతో భద్రతా కేబినెట్ సమావేశంలో ప్రధాని బెంజమిన్ నెతన్యాహు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నెతన్యాహు మాట్లాడుతూ.. ఇరాన్ చర్యలు మొత్తం మధ్య ఆసియానే ప్రమాదంలోకి నెట్టేసిందని అన్నారు. మధ్య ఆసియా మొత్తాన్ని యుద్ధంలోకి తీసుకొచ్చిందని పేర్కొన్నారు. దీనికి ఇరాన్‌కు తగిన గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. పోరాడతాం.. కచ్చితంగా గెలిచి తీరుతామని వ్యాఖ్యానించారు.
ఇరాన్ దాడులపై ఇజ్రాయెల్ ఆర్మీ చీఫ్ కూడా తీవ్రంగా స్పందించారు. ఇరాన్‌పై విరుచుకుపడతామని హెచ్చరించారు. ఇరాన్ వైపు నుంచి 180 మిసైల్స్ వచ్చాయని.. వీటిలో దాదాపు అన్నింటినీ నిర్వీర్యం చేశామని ప్రకటించారు. ఈ క్షిపణుల్లో కొన్ని భూమిపైకి చేరుకుని విధ్వంసం సృష్టించాయని తెలిపారు. ఏ స్థాయిలో నష్టం జరిగిందో అంచనా వేస్తున్నామని తెలిపారు.
పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. ఇజ్రాయెల్-హమాస్, హెజ్బొల్లా మధ్య జరుగుతున్న యుద్ధంలో ఇప్పుడు ఇరాన్ కూడా ప్రత్యక్షంగా దిగింది. మంగళవారం సుమారు 500 క్షిపణులు, రాకెట్లతో ఇజ్రాయెల్‌పై విరుచుకుపడింది. దీంతో టెల్ అవీవ్ బాంబుల మోతతో దద్దరిల్లింది. పలు భవనాలు, వ్యాపార సంస్థలు దెబ్బతిన్నాయి. పౌరులు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని ఇజ్రాయల్ హెచ్చరికలు జారీ చేసింది. వేలాది మందిని బాంబు షెల్టర్లకు తరలించింది. దాడులను అడ్డుకోవడానికి తన రక్షణ వ్యవస్థను సిద్ధం చేసింది. లెబనాన్‌లో హెజ్బొల్లా నేతల మరణాలకు ప్రతీకారంగా ఇరాన్ ఈ దాడులకు దిగింది.