దుబాయ్, ఏప్రిల్ 9 : బీరుట్‌పై ఇజ్రాయెల్ కురిపించిన బాంబుల వర్షం తీవ్రతకు ఇరాన్ యుద్ధంలో తాత్కాలిక కాల్పుల విరమణ గురువారం కుంటుపడింది. హొర్ముజ్ జలసంధిపై ఇరాన్ మరింత పట్టుబిగించి నౌకల రవాణాను పూర్తిగా మళ్లీ అడ్డుకోవడంతో శనివారం ఇరాన్, అమెరికా మధ్య ఇస్లామాబాద్‌లో జరగవలసి ఉన్న చర్చలపై అనిశ్చితి నెలకొంది. మంగళవారం రాత్రి కాల్పుల విరమణ తర్వాత తమదే విజయమని ప్రకటించుకున్న ఇరాన్, అమెరికా పరస్పరం ఒత్తిడి పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నది. చమురు రవాణాకు అత్యంత కీలక జలమార్గమైన హొర్ముజ్ జలసంధిలో ఇరాన్ సైన్యం మందుపాతరలు అమర్చినట్లు పాక్షిక అధికారిక వార్తా సంస్థలు తెలిపాయి. ఒప్పందంలోని అంశాలను నెరవేర్చకపోతే గతంలో కన్నా బలంగా అమెరికా బలగాలు దాడి చేస్తాయని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌ను హెచ్చరించగా కాల్పుల విరమణ ఒప్పందంలో ఇజ్రాయెల్, హెజ్బొల్లా మధ్య ఘర్షణలకు విరామాన్ని చేర్చారా అన్న విషయమై భిన్న వాదనలు వినవస్తున్నాయి. ఫిబ్రవరి 28న యుద్ధం ప్రారంభమయ్యాక బుధవారం మొదటిసారి బీరుట్‌పై ఇజ్రాయెల్ భీకర స్థాయిలో విరుచుకుపడింది. ఈ దాడుల్లో వందలాది మంది మరణించారు. ఉద్రిక్తతలకు కేంద్ర బిందువుగా ఉన్న ఇరాన్ వద్ద ఉన్న శుద్ధిచేసిన యురేనియం నిల్వల గతి ఏమిటి, జలసంధి గుండా నౌకల సాధారణ రాకపోకలు ఎప్పుడు, ఎలా పునఃప్రారంభమవుతాయి, ఈ ప్రాంతంలోని సాయుధ తీవ్రవాద గ్రూపులకు మద్దతు ఇచ్చే ఇరాన్ సామర్థ్యానికి ఏమవుతుంది? అనే విషయాలపై కూడా ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
పశ్చిమాసియాలో అమెరికా తన దురాక్రమణను ముగించి, ఇజ్రాయెల్ లెబనాన్‌పై దాడులను నిలిపివేసిన తర్వాత అంతర్జాతీయ నిబంధనలు, అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా నౌకలను ఇరాన్ జలసంధి గుండా వెళ్లడానికి అనుమతిస్తుందని ఇరాన్ ఉప విదేశాంగ మంత్రి సయీద్ ఖతిబ్జాదే బీబీసీకి గురువారం తెలిపారు. యూఏఈ ప్రధాన చమురు సంస్థ అధిపతి సుల్తాన్ అల్-జాబెర్ మాట్లాడుతూ చమురుతో నిండిన సుమారు 230 నౌకలు జలసంధి గుండా వెళ్లడానికి వేచి ఉన్నాయని, వాటిని ఎటువంటి షరతులు లేకుండా ఈ మార్గంలో ప్రయాణించడానికి అనుమతించాలని అన్నారు. జలసంధి మూసివేత వల్ల చమురు ధరలు విపరీతంగా పెరిగాయి. దీని ప్రభావం పశ్చిమాసియాకు ఆవల కూడా పెట్రోల్, ఆహారం, ఇతర నిత్యావసరాల ధరలపై పడింది. బుధవారం కాల్పుల విరమణ ప్రకటనతో క్షీణించిన చమురు ధరలు ఒప్పందంపై సందిగ్ధత కారణంగా మళ్లీ పెరిగాయి. గురువారం బ్రెంట్ ముడి చమురు బ్యారెల్ ధర 98 డాలర్లు ఉండగా యుద్ధం ప్రారంభమైన నాటి నుంచి ఇది దాదాపు 35 శాతం ఎక్కువ. కాగా, కాల్పుల విరమణ ఒప్పంద చర్చల్లో హొర్ముజ్ జలసంధిని ఉపయోగించుకునే నౌకల నుండి రుసుము వసూలు చేసే వ్యవస్థను అధికారికంగా ఏర్పాటు చేయడానికి ఇరాన్‌కు అనుమతి ఇవ్వాలా వద్దా అనే అంశం ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉంది.
యుద్ధానికి వెళ్లే ముందు ఇరాన్‌లోని శుద్ధి చేసిన యురేనియంను నిర్మూలిస్తామని ప్రకటించిన అమెరికా, ఇజ్రాయెల్ అది సాధించలేకపోవడంతో ఇప్పుడు ఆ శుద్ధి చేసిన యురేనియం గతి ఏమిటన్న ప్రశ్నకు కూడా స్పష్టమైన సమాధానం లేదు. ఇరాన్ ఎన్నటికీ అణ్వాయుధాలను తయారు చేయలేని స్థితిలో ఉండాలని అమెరికా పట్టుబడుతున్నది. అలాగే వాటి తయారీకి ఉపయోగపడే శుద్ధిచేసిన యురేనియం నిల్వలను నిర్మూలించాలని కూడా అమెరికా కోరుతున్నది. అయితే ఇరాన్ మాత్రం తమ కార్యక్రమం శాంతియుతమైనదని వాదిస్తున్నది. గత ఏడాది అమెరికా, ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో భూమిలో పాతుకుపోయిన యురేనియం అణువులను తొలగించేందుకు అమెరికా ఇరాన్‌తో కలసి పనిచేస్తుందని ట్రంప్ బుధవారం చెప్పినప్పటికీ ఇరాన్ దీనిని ధృవీకరించలేదు. ఇరాన్ ప్రచురించిన కాల్పుల విరమణ ఒప్పందం ప్రతిలో మాత్రం యురేనియంను శుద్ధి చేసుకోవడానికి ఇరాన్‌ను అనుమతించనున్నట్లు పేర్కొని ఉంది. కాల్పుల విరమణ చర్చలకు యురేనియంను శుద్ధి చేసుకునే ఇరాన్ హక్కును పరిరక్షించడం అవసరమని ఇరాన్ అణు సంస్థ అధిపతి మహమ్మద్ ఇస్లామీ అన్నారు.