టెహ్రాన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహులపై ఇరాన్‌లోని అగ్ర శ్రేణి షియా మత పెద్ద ఫత్వా జారీ చేశారు. ట్రంప్, నెతన్యాహు దేవుడికి శత్రువులని ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరూ ఇస్లామిక్ రిపబ్లిక్ నేతను బెదిరిస్తున్నారని, ప్రపంచ ముస్లింలంతా ఏకమై, వీరిద్దరినీ గద్దె దించాలని పిలుపునిచ్చారు. గ్రాండ్ అయతొల్లా నాసెర్ మకరెమ్ షిరాజీ నుంచి ఈ డిక్రీ విడుదలైంది.
ఇరాన్ నేతను బెదిరించే వ్యక్తిని లేదా ప్రభుత్వాన్ని దేవునిపై యుద్ధం ప్రకటించినట్లుగా పరిగణిస్తామని పేర్కొంది. ముస్లింలు లేదా ఇస్లామిక్ ప్రభుత్వాలు ఇటువంటి శత్రువుకు సహకరించడాన్ని నిషేధించినట్లు తెలిపింది. ఈ శత్రువులు తమ తప్పుడు మాటలు, చేతలకు పశ్చాత్తాపపడేలా చేయవలసిన అవసరం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అందరు ముస్లింలకు ఉందని చెప్పింది.