Strait of Hormuz : హోర్ముజ్ జలసంధి విషయంలో ఇరాన్ కీలక ప్రకటన చేసింది. శతృవుల నౌకలు మినహా మిగిలిన దేశాల నౌకలు అన్నింటినీ హోర్ముజ్ జలసంధి నుంచి అనుమతిస్తామని ప్రకటించింది. 48 గంటల్లోగా హోర్ముజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని, లేకుంటే ఇరాన్‌లోని పవర్ప్లాంట్లపై దాడి చేస్తామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హెచ్చరించిన కొన్ని గంటల్లోపే ఇరాన్ ఈ ప్రకటన చేసింది.
ఐక్యరాజ్యసమితి ప్రతినిధితో ఇరాన్ ఈ విషయాన్ని వెల్లడించింది. దీంతో ఇంతకాలం హోర్ముజ్ జలసంధి విషయంలో అనుసరించిన వైఖరిలో ఇరాన్ కాస్త మెత్తబడ్డట్లు కనిపిస్తోంది. ఈ ప్రకటన ప్రకారం ఇరాన్ శతృదేశాలతో సంబంధం లేని నౌకల్ని ఇకపై హోర్ముజ్ నుంచి అనుమతిస్తారు. దీనికోసం భద్రత, రక్షణ కోసం ఇరాన్ సహకారం పొందాల్సి ఉంటుందని ఇంటర్నేషనల్ మ్యారిటైమ్ ఆర్గనైజేషన్‌లో ఇరాన్ ప్రతినిధి అలీ మౌసావి తెలిపారు. అవసరమైతే ఈ విషయంలో నౌకల రక్షణ కోసం ఐక్యరాజ్యసమితితో కలిసి పని చేస్తామని వెల్లడించారు. గల్ఫ్ తీరంలో నౌకాయన సిబ్బంది రక్షణ కోసం సహకరిస్తామని, దీనంతటికీ ఇరాన్ మీద శతృదేశాలు దాడులు చేయడమే కారణమని అన్నారు.
దౌత్యమార్గం తమ మొదటి ప్రాధాన్యమని, అయితే, ఉద్రిక్తతలు తగ్గాలంటే పరస్పర విశ్వాసం, నమ్మకం అవసరమని ఆయన అలీ మౌసావి వ్యాఖ్యానించారు. ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా దాడులు చేసిన తర్వాత నుంచి హోర్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసింది. ఒక్క చుక్క ఆయిల్ కూడా ఈ మార్గంలో అమెరికా, ఇజ్రాయెల్‌లకు వెళ్లనిచ్చేది లేదని తెలిపింది.