Iran : ఇరాన్ లో నెలకొన్న సంక్షోభం భారత బియ్యం ఎగుమతులపై పడింది. ప్రస్తుతం ఇరాన్ అంతర్యుద్ధంతో ఉడుకుతున్న సంగతి తెలిసిందే. ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్నారు. ఇప్పటికే ఆర్థిక పరిస్తితి మందగించింది. మరోవైపు అమెరికా హెచ్చరికల నేపథ్యంలో ఇరాన్ కరెన్సీ విలువ దారుణంగా పడిపోయింది. దీంతో విదేశీ ఆహారోత్పత్తుల దిగుమతులపై ఇస్తున్న సబ్సిడీని ఇరాన్ ఎత్తివేసింది.
ఈ నేపథ్యంలో ఇండియా నుంచి ఇరాన్ కు ప్రీమియం బాస్మతి బియ్యం ఎగుమతులు నిలిచిపోయాయి. ఇరాన్ కు ఎగుమతి చేయాల్సిన బాస్మతి బియ్యం భారత గోడౌన్లలోనే నిలిచిపోయింది. దాదాపు రూ.2,000 కోట్ల విలువైన బియ్యం ఎగుమతులు నిలిచిపోయినట్లు మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. ఈ విషయంలో ఇరాన్ నుంచి స్పష్టమైన హామీ ఇస్తేనే బియ్యం ఎగుమతులు సాధ్యమవుతాయి. ఇండియాలో పండే ప్రీమియం బాస్మతి బియ్యం ఎక్కువగా ఇరాన్ కు ఎగుమతి అవుతుంది. పంజాబ్, హరియాణా రాష్ట్రాలు అత్యధికంగా బాస్మతి బియ్యం పండిస్తున్నాయి. ఇటీవలి కాలంలో డాలర్ తో పోలిస్తే ఇరాన్ కరెన్సీ రియాల్ విలువ అత్యల్ప స్థాయికి పడిపోయింది. దీంతో అక్కడి ప్రభుత్వం ఆహార పదార్థాల దిగుమతులకు ఇస్తున్న సబ్సిడీని ఎత్తివేసింది.
ఇదే సమయంలో ఇండియా.. ఇరాన్ నుంచి చమురు కొనుగోళ్లు తగ్గించింది. అయితే, ఇరాన్ మాత్రం ఇండియా నుంచి మెడిసిన్స్, టీ పౌడర్, బాస్మతి రైస్ వంటివి దిగుమతి చేసుకుంటూనే ఉంది. ఇండియా నుంచి అత్యధికంగా బాస్మతి రైస్ దిగుమతి చేసుకునే దేశం ఇండియానే. ప్రతి ఏటా 12 లక్షల టన్నులు.. అంటే.. రూ.12,000 కోట్ల విలువైన బియ్యాన్ని ఇరాన్ దిగుమతి చేసుకుంటుంది. కానీ, తాజా పరిస్తితుల నేపథ్యంలో కొద్ది రోజులుగా ఇండియా నుంచి ఎగుమతులు ఆగిపోయాయి.