ఇస్లామాబాద్, టెహ్రాన్, ఏప్రిల్ 18: కీలకమైన జలమార్గం హొర్ముజ్ జలసంధిని తెరవాలన్న తన ఇదివరకటి నిర్ణయాన్ని ఉపసంహరించుకుంటూ దానిపై ఇరాన్ శనివారం మళ్లీ ఆంక్షలు విధించింది. అమెరికా కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించినట్లు ఇరాన్ ఆరోపించింది. ఇరాన్‌కు సంబంధించిన నౌకా రవాణాపై విధించిన దిగ్బంధనాన్ని తొలగించబోమని అమెరికా ప్రకటించిన వెంటనే ఇరాన్ తన వైఖరిని వేగంగా మార్చుకుంది. ఇరాన్ ఓడరేవులపై అమెరికా దిగ్బంధనం అమల్లో ఉన్నతంత కాలం హొర్ముజ్ జలసంధి గుండా రవాణాను నిరోధించడం కొనసాగిస్తామని ఇరాన్ హెచ్చరించింది. మరోవైపు జలసంధిని శుక్రవారం తిరిగి తెరిచినట్లు ఇరాన్ ప్రకటించినప్పటికీ దాని అణు కార్యక్రమంతో సహా తమ దేశంతో ఇరాన్ ఒక ఒప్పందానికి వచ్చేవరకు తమ దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. వ్యూహాత్మకమైన ఈ కీలక జలసంధిపై నెలకొన్న వివాదం, ప్రపంచ ఇంధన సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేసే అవకాశం ఉన్నది.
ఇరాన్, అమెరికా ప్రతినిధుల మధ్య తాజా విడత చర్చలు సోమవారం(ఏప్రిల్ 20) ఇస్లామాబాద్‌లో జరిగే అవకాశం ఉంది. ఇరు దేశాల ప్రతినిధి బృందాలు ఆదివారం పాకిస్థాన్ రాజధాని ఇస్లామాబాద్ చేరుకోవచ్చని ఇరాన్‌ను ఉటంకిస్తూ సీఎన్ఎన్ తెలిపింది.
తమతో శత్రుత్వానికి ముగింపు పలికేందుకు బుధవారం(ఏప్రిల్ 22) లోగా ఒక విస్తృత ఒప్పందం కుదరకపోతే ఇరాన్‌తో కాల్పుల విరమణను రద్దు చేసుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ శుక్రవారం హెచ్చరించారు.
తిరిగి ఆంక్షలు విధించిన తర్వాత హొర్ముజ్ జలసంధిని దాటేందుకు ప్రయత్నిస్తున్న పలు నౌకలపై కాల్పులు జరిగినట్లు తెలిసిందని, శత్రువులకు మరో చేదు ఓటమిని రుచి చూపించేందుకు తమ నౌకాదళం సిద్ధంగా ఇరాన్ సుప్రీం నాయకుడు మొజ్తాబా ఖమేనీ శనివారం హెచ్చరించారు. ఇరాన్ సైనిక దినోత్సవం సందర్భంగా తన టెలిగ్రామ్ చానెల్లో ఖమేనీ ఒక సందేశం పోస్టు చేశారు. కాల్పుల విరమణను అమెరికా ఉల్లంఘించిన కారణంగా హొర్ముజ్ జలసంధిని తిరిగి మూసివేసినట్లు ఇరాన్ ప్రకటించింది. జలసంధిని దాటేందుకు ప్రయత్నించిన రెండు మర్చంట్ నేవీ నౌకలపై కాల్పులు జరిగినట్లు రాయ్‌టర్స్ వార్తాసంస్థ తెలిపింది. భారత్ చమురు నౌక ఒకటి శనివారం హొర్ముజ్‌ను దాటింది.