టెహ్రాన్: పాకిస్థాన్ మధ్యవర్తిత్వంతో ద్వారా వచ్చే సలహాలను పాటించబోమని ఇరాన్ మంగళవారం స్పష్టం చేసింది. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించాలని తమపై ఒత్తిడి పెరిగినప్పటికీ, ఆ తరహా మధ్యవర్తిత్వ చర్చల్లో తాము పాల్గొనబోమని వెల్లడించింది. ఈ మేరకు ముంబైలోని ఇరాన్ కాన్సులేట్ జనరల్, ఇరాన్ విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి ఒక ప్రకటన విడుదల చేశారు. తాము అమెరికాతో ప్రత్యక్ష చర్చలు జరపబోమని తెలిపారు.
పాక్ చేస్తున్న మధ్యవర్తిత్వ ప్రయత్నాలు ఆ దేశం సొంత చొరవ అని, వాటిలో తాము పాల్గొనబోమని చెప్పారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించే చర్చల్లో కీలక పాత్ర పోషిస్తున్నామని పాక్ ప్రకటించుకొన్న వేళ ఇరాన్ ఈ ప్రకటన చేసింది. పాక్ నిర్వహించే చర్చల్లో పాల్గొంటామని ఇరాన్, అమెరికా ఇప్పటివరకు అధికారికంగా ప్రకటించలేదు.