మహబూబాబాద్, జూన్ 27 (నమస్తే తెలంగాణ) : ఉద్యోగాల విషయంలో ఎలాంటి స్పష్టత లేకపోవడంతో కొందరు భూ భారతి ఆపరేటర్లు మనోవేదనకు గురవుతున్నారు. భూముల క్రయ విక్రయాల్లో జరుగుతున్న అవినీతిని అరికట్టేందుకు గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను తహసీల్దార్లకు అప్పగించారు. ఇందుకు సంబంధించిన ఒప్పంద పత్రాలు తయారు చేసేందుకు ప్రత్యేకంగా ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఆపరేటర్లను నియమించారు. ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో ఒక ఆపరేటర్ (ఫీల్డ్ లెవల్ టెక్నికల్ స్టాఫ్)తో పాటు జిల్లా స్ధాయిలో కోఆర్డినేటర్ (డీసీ), ఇద్దరు సహాయ ఆపరేటర్లను ఏర్పాటు చేయగా ఏడేండ్లుగా విధులు నిర్వర్తిస్తున్నారు.
ఈ క్రమంలో గత మార్చితో వీరి ఉద్యోగ కొనసాగింపు గడువు ముగిసింది. అనంతరం తదుపరి కొసాగింపు (ఏప్రిల్ 2026-మార్చి 2027) కోసం ఇటీవల సీసీఎల్ఏ నుంచి కలెక్టర్లకు ఎఫ్‌టీఎస్‌ల కొనసాగింపురకు సంబంధించిన అందజేయాలని ఆదేశాలు వచ్చాయి. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా 81 ఎఫ్‌టీఎస్‌లు, డీసీలు విధులు నిర్వర్తిస్తున్నారు. అయితే అందులో కేవలం వరంగల్‌లో ఆరుగురు, హనుమకొండలో ఏడుగురు, మహబూబాబాద్‌లో ఐదుగురు, జనగామలో 10, ములుగులో ఐదుగురు, జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో ఐదుగురు, మొత్తం 38 మంది ఎఫ్టీఎస్లకు సంబంధించిన వివరాలు మాత్రమే ఇవ్వాలని పేర్కొన్నారు. అయితే ఎక్కువ రిజిస్ట్రేషన్లు అవుతున్న పెద్ద మండలాల్లోని ఎఫ్‌టీఎస్‌ల వివరాలు మాత్రమే కోరడం, తక్కువ అవుతున్న మండలాల్లోనివి అడగకపోవడంతో తమను తొలగించేందుకు నిర్ణయం తీసుకున్నారనే ఆందోళన వారిలో వ్యక్తమవుతున్నది.
తమను ఉద్యోగంలో ఉంచుతారా? లేదా? అనే భయానికి గురవుతున్నారు. చాలీచాలని వేతనాలతో అనేక ఏండ్లుగా సేవలందిస్తున్న తమను తొలగిస్తే భవిష్యత్ ఎలా అంటూ బెంగపడుతున్నారు. ఈ విషయమై మహబూబాబాద్ జిల్లా ఎఫ్‌టీఎస్‌లు గతంలో, సోమవారం కలెక్టర్ స్నేహా శబరీష్, అడిషనల్ కలెక్టర్ అనిల్‌కు వినతి పత్రం అందజేశారు. సీనియార్టీ, పనితీరు ఆధారంగా ఎఫ్టీఎస్ గుర్తింపు జరపాలని కోరారు. అయితే తహసీల్దార్ కార్యాలయంలోని కంప్యూటర్ ఆధారిత పనుల నిర్వహణలో వీరు ముఖ్యపాత్ర పోషిస్తున్నారు.
గతంలో ధరణి, ప్రస్తుతం భూ భారతి ఆపరేటర్లుగా పనిచేస్తున్న ఎఫ్టీఎస్లకు 12 నెలలుగా వేతనాలు పెండింగ్‌లో ఉన్నాయి. అయినప్పటికీ ఆర్థిక ఇబ్బందులకు ఓర్చి విధులు నిర్వర్తిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ధరణి ఆపరేటర్లను క్రమ బద్ధీకరిస్త్తామని ఇచ్చిన హామీని కాంగ్రెస్ సర్కారు అమలు చేయకపోగా ఉద్యోగం కొనసాగింపు విషయంలో స్పష్టతనివ్వకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమను కొనసాగిస్తూ ఉత్తర్వులు ఇవ్వాలని వారు కోరుతున్నారు.
ధరణి, భూ భారతి ఆపరేటర్‌గా తొమ్మిదేండ్లుగా విధులు నిర్వర్తిస్తున్నాను. తహసీల్దార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లతో పాటు అనేక సేవలందింస్తున్నాం. అయితే 2026-27 ఏడాదికి కొనసాగింపునకు సంబంధించి మానుకోట జిల్లాలో 19 మందికి ఐదుగురు ఎఫ్‌టీఎస్‌ల వివరాలు మాత్రమే ఇవ్వాలని కోరడంతో మిగతా వాళ్లం ఉద్యోగం ఉంటుందో? లేదో? అని ఆందోళన చెందుతున్నాం. ప్రభుత్వం పునరాలోచించి ఎఫ్‌టీఎస్‌లను కొనసాగించేలా చూడాలి.
– మధు, ఎఫ్టీఎస్, కేసముద్రం