Operation Sindoor : టర్కీ కొన్నేళ్లుగా ఇండియాకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. టర్కీలాగే పాకిస్తాన్ కూడా ఇస్లాం దేశం కావడం వల్ల ఇండియా-పాక్ అంశంలో పాకిస్తాన్‌కు మద్దతు ఇస్తూ వస్తోంది. అయితే, ఇప్పుడు టర్కీ వైఖరి ఆ దేశంపై ప్రభావం చూపుతోంది. ఇండియా నుంచి టర్కీ వెళ్లే భారతీయ సందర్శకుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. ఒక్క ఏడాదిలోనే దాదాపు 25 శాతం తగ్గుదల కనిపించింది. టర్కీ పర్యాటక విభాగం తాజాగా విడుదల చేసిన గణాంకాల ద్వారా ఈ విషయం వెల్లడైంది. టర్కీ వెళ్లే భారతీయుల సంఖ్య క్రమంగా తగ్గుతోంది.
టర్కీకి, ఇండియాకు మధ్య కొన్నేళ్లుగా విబేధాలున్నాయి. టర్కీ అనుసరిస్తున్న తప్పుడు వైఖరే దీనికి కారణం. జమ్మూ-కాశ్మీర్ అంశంలో పాకిస్తాన్‌కు టర్కీ మద్దతు తెలిపింది. ఆపరేషన్ సిందూర్ సమయంలో పాకిస్తాన్‌కు టర్కీ ఆయుధ సామగ్రి అందించి సహాయం చేసింది. ఇలా ఇండియాకు వ్యతిరేకంగా టర్కీ వ్యవహరిస్తుండటంతో ఇండియా ప్రభుత్వంతోపాటు, ప్రజలు కూడా ఘాటుగా రియాక్టయ్యారు. ఇప్పటికే ఇరు దేశాల వాణిజ్య, వ్యాపార సంబంధాలు కొంత దెబ్బతిన్నాయి. ఇదే సమయంలో భారత సోషల్ మీడియాలో టర్కీ వ్యతిరేక ఉద్యమం ప్రారంభమైంది. టర్కీ ఉత్పత్తులు నిషేధించాలని, టర్కీకి పర్యటనలను భారతీయులు మానుకోవాలని సోషల్ మీడియాలో ‘బాయ్‌కాట్ టర్కీ’ పేరుతో ఉద్యమం నడిచింది. టర్కీ వైఖరితోపాటు, ఇండియన్ సోషల్ మీడియా ప్రభావం వల్లే కావొచ్చు.. 2025లో ఇండియా నుంచి టర్కీ వెళ్లే ప్రయాణికుల సంఖ్య 25 శాతం తగ్గింది. 2024లో 330,985 మంది భారతీయులు టర్కీ వెళ్లగా.. 2025లో 250,762 మంది మాత్రమే టర్కీ వెళ్లారు.
ఇందులో వ్యాపారాల కోసం, వినోదం కోసం, అలాగే ఇతర అన్ని అవసరాల కోసం వెళ్లిన వారు ఉన్నారు. టర్కీకి వచ్చే విదేశీ పర్యాటకుల శాతంలో భారతీయుల వాటా తక్కువే కావొచ్చు. కానీ, ఆ దేశంపై మన ప్రభావం మాత్రం ఉంది. మరోవైపు టర్కీ ఉత్పత్తుల్ని కూడా నిషేధించాలని, వాటిని కొనుగోలు చేయకూడదని కూడా అప్పట్లో సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. దీంతో ఆ దేశం నుంచి ఇండియా దిగుమతులు కొంతమేర తగ్గాయి. ఇక.. పహల్గాంలో జరిగిన ఉగ్ర దాడికి వ్యతిరేకంగా పాకిస్తాన్‌పై ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌ను టర్కీ, అజర్ బైజాన్ వ్యతిరేకించాయి. ఈ అంశంలో పాకిస్తాన్‌కు మద్దతు ప్రకటించాయి.