Indian couples | ప్రస్తుతం ప్రపంచం మొత్తం అగ్రరాజ్యం వైపే చూస్తోంది. అందుకు కారణం అమెరికా 47వ అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) బాధ్యతలు చేపట్టడమే. ఆయన రాకతో ఎలాంటి మార్పులు ఉండబోతాయోనన్న భయాలు అన్ని దేశాల్లో నెలకొంది. ఆయన తీసుకునే నిర్ణయాలు అమెరికాలో ఉంటున్న ఇతర దేశాల ప్రజల గుండెల్లో గుబులు నెలకొంది. అమెరికా అధ్యక్ష పగ్గాలను రెండోసారి చేబూనిన డొనాల్డ్ ట్రంప్ మొదటిరోజే వందకుపైగా కార్యనిర్వాహక ఉత్తర్వులపై (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు) సంతకాలు చేసిన విషయం తెలిసిందే.
వలసల నుంచి మొదలుకొని పర్యావరణం, వాణిజ్యం వరకు అమెరికాకు సంబంధించి అనేక కీలక నిర్ణయాలను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల రూపంలో ట్రంప్ అమలులోకి తీసుకొచ్చారు. తన ఆలోచనల అమలులో కఠినంగా ఉండనున్నట్టు ఆయన చెప్పకనే చెప్పారు. ఈ నిర్ణయాలు అమెరికాతో పాటు ప్రపంచంపైనా ప్రభావాన్ని చూపనున్నాయి. ముఖ్యంగా జన్మతః పౌరసత్వం (Birthright Citizenship) విధానం రద్దు చేస్తూ ట్రంప్ తీసుకొన్న నిర్ణయం.. లక్షలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపించనున్నట్టు నిపుణులు చెప్తున్నారు. ట్రంప్ నిర్ణయంతో ప్రస్తుతం భారతీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.
అమెరికా పౌరులకు పుట్టిన వారికే కాకుండా.. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా అమెరికా పౌరసత్వం లభిస్తుంది. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పటి నుంచి ఈ జన్మతః పౌరసత్వ విధానం కొనసాగుతున్నది. అయితే, దీన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ‘అక్రమ వలసదారులకు, తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చిన వారికి పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించబోదు’ అని ట్రంప్ ప్రకటించారు. ట్రంప్ ఆదేశాలతో ఈ చట్టం వచ్చే నెల అంటే ఫిబ్రవరి 20వ తేదీ నుంచి అమల్లోకి (citizenship deadline) వస్తుంది. అంతకుముందు వరకు అమెరికాలో ఉంటున్న భారతీయులు లేదా ఇతర దేశాల దంపతులకు పుట్టిన బిడ్డలను అమెరికా పౌరసత్వం లభిస్తుంది. ఆ తర్వాత పుట్టిన వారికి ఇది లభించదు. దీంతో అమెరికాలో ఉన్న భారతీయ గర్భిణిలు నెలల నిండక ముందే డెలివరీకి సిద్ధమవుతున్నట్లు అమెరికా మీడియా నివేదిస్తోంది.
నెలలు నిండకముందే పిల్లల్ని కనేందుకు భారతీయ దంపతులు తొందరపడుతున్నట్లు పలు నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఇందుకోసం ఆసుపత్రుల వద్ద క్యూ కడుతున్నారట. న్యూజెర్సీలో ప్రసూతి ఆసుపత్రికి చెందిన వైద్యురాలు ఎస్డి రమకు గత రెండు రోజుల వ్యవధిలోనే భారతీయ దంపతుల నుంచి ముందస్తు డెలివరీ అభ్యర్థనలు ఎక్కువైనట్లు మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. ముఖ్యంగా 8, 9 నెలల గర్భిణిలు సీ-సెక్షన్ (సిజేరియన్) కోసం తొందరపడుతున్నట్లు తెలిసింది.
అంతేకాదు ప్రస్తుతం ఏడు నెలలు కూడా నిండని ఓ గర్భిణి సైతం ముందస్తు ప్రసవం కోసం వైద్యులను సంప్రదించినట్లు తెలిసింది. వాస్తవానికి ఆమె ప్రసవ తేదీ మార్చిలో ఉండగా.. ట్రంప్ నిర్ణయంతో ముందస్తు డెలివరీకి సిద్ధమయ్యారట. ఇలా నెలలు నిండకుండానే జరిగే కాన్పుల కారణంగా తల్లి, బిడ్డకు ప్రమాదమని వైద్యులు చెబుతున్నారు. నెలలు నిండకుండానే పుట్టిన పిల్లల్లో ఊపిరితిత్తులు పూర్తిస్థాయిలో రూపొందవని, శిశువు తక్కువ బరువు, పోషణతోపాటు నాడీ సంబంధిత సమస్యలు ఉంటాయని పేర్కొంటున్నారు.
Also Read..
Birthright Citizenship: జన్మతః పౌరసత్వం రద్దుపై భారత సంతతి చట్టసభ ప్రతినిధుల ఆందోళన
America | జన్మతః పౌరసత్వం రద్దుపై న్యాయపోరు.. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై అమెరికాలో తీవ్ర వ్యతిరేకత