వాషింగ్టన్/స్పెషల్ టాస్క్ బ్యూరో, జనవరి 21: అమెరికా అధ్యక్ష పగ్గాలను రెండోసారి చేబూనిన డొనాల్డ్ ట్రంప్ మొదటిరోజే కఠినమైన నిర్ణయాలు తీసుకొన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఆచరణలోకి తీసుకొచ్చారు. అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం ముగియగానే పెన్ను అందుకున్నారు. పదుల సంఖ్యలో కార్యనిర్వాహక ఉత్తర్వులపై (ఎగ్జిక్యూటివ్ ఆర్డర్లు) సంతకాలు చేశారు. వలసల నుంచి మొదలుకొని పర్యావరణం, వాణిజ్యం వరకు అమెరికాకు సంబంధించి అనేక కీలక నిర్ణయాలను ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ల రూపంలో ట్రంప్ అమలులోకి తీసుకొచ్చారు. తన ఆలోచనల అమలులో కఠినంగా ఉండనున్నట్టు ఆయన చెప్పకనే చెప్పారు. ఈ నిర్ణయాలు అమెరికాతో పాటు ప్రపంచంపైనా ప్రభావాన్ని చూపనున్నాయి. ముఖ్యంగా జన్మతః పౌరసత్వం విధానం రద్దు చేస్తూ ట్రంప్ తీసుకొన్న నిర్ణయం.. లక్షలాది మంది భారతీయులపై తీవ్ర ప్రభావం చూపించనున్నట్టు నిపుణులు చెప్తున్నారు.
అమెరికా పౌరులకు పుట్టిన వారికే కాకుండా.. వలస వచ్చిన వారికి అమెరికా గడ్డపై పిల్లలు పుడితే.. ఆ చిన్నారులకు సహజంగా అమెరికా పౌరసత్వం లభిస్తుంది. 1868లో చేసిన 14వ రాజ్యాంగ సవరణ ప్రకారం అప్పటి నుంచి ఈ జన్మతః పౌరసత్వ విధానం కొనసాగుతున్నది. అయితే, దీన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీ చేశారు. ‘అక్రమ వలసదారులకు, తాత్కాలిక వీసాపై అమెరికాకు వచ్చిన వారికి పుట్టే పిల్లలకు లభించే జన్మతః పౌరసత్వాన్ని మా ఫెడరల్ ప్రభుత్వం గుర్తించబోదు’ అని ట్రంప్ ప్రకటించారు.
ఆర్డర్లో ఏమున్నది?: అమెరికా గడ్డపై బిడ్డకు జన్మనిచ్చే సమయానికి తల్లిదండ్రులు అమెరికా పౌరులు కాకపోయినా, ఒకవేళ తండ్రి చట్టబద్ధంగా అమెరికాలో ఉన్నప్పటికీ (తాత్కాలిక వీసాపై).. శాశ్వత నివాసి కాకపోయినా.. ఆ పుట్టిన పిల్లలకు అమెరికా పౌరసత్వం లభించదు. అలాగే, తండ్రి శాశ్వత నివాసి అయినప్పటికీ.. తల్లి తాత్కాలిక వీసా మీద అమెరికాలో నివాసం ఉంటూ బిడ్డను కంటే కూడా ఇదే నియమం వర్తిస్తుంది.
2024 చివరినాటికి అమెరికాలో 54 లక్షల మంది ప్రవాస భారతీయులు ఉన్నారు. అమెరికా జనాభాలో ఇది 1.47 శాతం. వీరిలో 34 శాతం మంది అమెరికాలోనే పుట్టారు. మిగతావారంతా వలసదారులు. ఈ క్రమంలో ట్రంప్ తీసుకొన్న తాజా నిర్ణయం ఎన్నారైలపై తప్పకుండా ప్రభావం చూపిస్తుందని నిపుణులు అంటున్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. హెచ్1బీ వంటి తాత్కాలిక వీసాపై అమెరికా వెళ్లి.. గ్రీన్‌కార్డు కోసం వేచిచూస్తున్న వారికి పుట్టిన సంతానానికి ఇప్పటిమాదిరిగా అమెరికా పౌరసత్వం ఇకపై లభించబోదు.
జన్మతః పౌరసత్వ విధానాన్ని రద్దు చేస్తూ ట్రంప్ తీసుకొన్న నిర్ణయం అమల్లోకి రావడం అంత సులభమేమీ కాదని న్యాయకోవిదులు అంటున్నారు. ఈ నిర్ణయం అమల్లోకి రావాలంటే అమెరికా రాజ్యాంగంలోని నిబంధనలను మార్చాల్సి ఉంటుందని, దీనికోసం హౌజ్, సెనేట్‌లో మూడింట రెండొంతుల మెజార్టీ అవసరమని గుర్తు చేస్తున్నారు. అలాగే రాష్ర్టాల శాసనసభల్లో నాలుగింట మూడొంతుల మంది ఆమోదించాల్సి ఉంటుందని చెప్తున్నారు. కాగా కొత్త సెనేట్‌లో డెమొక్రాట్లకు 47 స్థానాలు ఉండగా ట్రంప్ నేతృత్వం వహిస్తున్న రిపబ్లికన్ పార్టీకి 51 సీట్లు ఉన్నాయి. హౌజ్‌లో డెమొక్రాట్లకు 215 సీట్లు ఉండగా, రిపబ్లికన్లకు 218 స్థానాలు ఉన్నాయి.
జన్మతః పౌరసత్వ విధానాన్ని రద్దు చేస్తూ ట్రంప్ తీసుకొన్న నిర్ణయం నేపథ్యంలో అమెరికాలో అక్రమంగా ఉంటున్న 18 వేల మంది భారతీయులను తిరిగి వెనక్కి రప్పించడానికి కేంద్రం ప్రయత్నాలు ముమ్మరం చేసింది. ఇదే విషయంపై అమెరికా సర్కారుతోనూ చర్చలు జరుపుతున్నదని సంబంధిత వర్గాలు పేర్కొన్నాయి. ఇరు దేశాల దౌత్య-వాణిజ్య సంబంధాలపై ప్రభావం పడకూడదన్న ఉద్దేశంతోనే కేంద్రం ఈ నిర్ణయం తీసుకొన్నట్టు సమాచారం. కాగా అమెరికాలో భారత్‌కు చెందిన అక్రమ వలసదారులు ఇంకా ఎక్కువమంది ఉండే అవకాశమున్నదని నిపుణులు చెప్తున్నారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) నుంచి వైదొలుగుతూ ట్రంప్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అంతర్జాతీయ సంస్థకు చైనా కంటే అమెరికానే ఎక్కువ నిధులు వెచ్చించాల్సి వస్తుందనే కారణంతో వైదొలుగుతున్నట్టు ట్రంప్ ప్రకటించారు. పర్యావరణ పరిరక్షణకు ప్రపంచ దేశాలు కలిసి చేసిన పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి సైతం అమెరికా తప్పుకుంటున్నట్టు ట్రంప్ కార్యనిర్వాహక ఉత్తర్వులు జారీ చేశారు. తన మొదటి పర్యాయంలోనూ ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు.
ప్రభావం: అమెరికా తాజా ప్రకటనతో డబ్ల్యూహెచ్‌వోకు ఆర్థికంగా కొంత ఇబ్బందికర పరిస్థితి కలుగొచ్చు. అలాగే ఆ సంస్థ పేద, మధ్యతరగతి దేశాల్లో చేపట్టే హెల్త్ క్యాంప్లపైనా ఈ ప్రభావం ఉండొచ్చు. వాతావరణంలోకి కాలుష్యాన్ని ఎక్కువగా వెదజల్లే దేశాల జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉంటుంది. పారిస్ పర్యావరణ ఒప్పందం నుంచి ఆ దేశం వైదొలగడం కూడా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలపై ప్రభావాన్ని చూపొచ్చు.
సరిహద్దు దేశాలైన మెక్సికో, కెనడా నుంచి వచ్చే దిగుమతులపై ఫిబ్రవరి 1 నుంచి అదనంగా 25 శాతం మేర సుంకాలు విధించనున్నట్టు ట్రంప్ ప్రకటించారు.
ప్రభావం: భారత ఉత్పత్తులపై సుంకాలు విధిస్తామంటూ ఇదివరకే ట్రంప్ ప్రకటించారు. తాజాగా మెక్సికో, కెనడా విషయంలో ఆయన నిర్ణయం ప్రకటించడంతో త్వరలోనే భారత్ సహా ఇతర దేశాలపైనా టారిఫ్‌ల వాత ఉండొచ్చన్న వాదనలు పెరుగుతున్నాయి. మంగళవారం స్టాక్‌మార్కెట్ల నష్టానికి ఇదే ప్రధాన కారణం కావడం గమనార్హం. కాగా అంతర్జాతీయ మారకంగా ఉన్న అమెరికన్ డాలర్‌ను కాదని బ్రిక్స్ కరెన్సీ తీసుకొస్తే.. ఇండియా భాగస్వామిగా ఉన్న బ్రిక్స్ దేశాలపై 100 శాతం సుంకాలు విధిస్తానని సోమవారం ట్రంప్ మళ్లీ హెచ్చరించారు.
వలస, శరణార్థ విధానాలకు సంబంధించి అనేక కొత్త ఆంక్షలను ట్రంప్ ప్రకటించారు. అమెరికా-మెక్సికో సరిహద్దుకు బలగాలు పంపుతానని, బోర్డర్లో జాతీయ ఎమర్జెన్సీ విధిస్తానని స్పష్టం చేశారు.
ప్రభావం: అనధికారికంగా ఏటా వేలాదిమంది భారత్ నుంచి అమెరికాకు శరణార్థులుగా వెళ్తున్నారు. ట్రంప్ తాజా ఆంక్షలు, సరిహద్దుల్లో బలగాల మోహరింపుతో వాళ్లకు చట్టపరమైన చిక్కులు మరింతగా పెరుగనున్నాయి.