America | జన్మతః పౌరసత్వం రద్దుపై న్యాయపోరు.. డొనాల్డ్ ట్రంప్ నిర్ణయంపై అమెరికాలో తీవ్ర వ్యతిరేకత
అమెరికాలో జన్మించే పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను సవాల్ చేస్తూ కోర్టుల్లో నాలుగు దావాలు దాఖలయ్యాయి.
- 22 అమెరికా రాష్ర్టాల దావా
- అక్రమ వలసదారులపై ట్రంప్ మరిన్ని కఠిన ఆదేశాలు
- స్కూళ్లు, చర్చ్‌లలో ఉన్నా అరెస్టు చేయొచ్చని ఉత్తర్వులు
- ట్రంప్ నిర్ణయంపై అమెరికాలోని 22 రాష్ర్టాల దావా
- రాజ్యాంగ సవరణ చేస్తేనే అమలు సాధ్యం: నిపుణులు
America | వాషింగ్టన్, జనవరి 22: అమెరికాలో జన్మించే పిల్లలకు జన్మతః వచ్చే పౌరసత్వాన్ని రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతున్నది. ట్రంప్ జారీ చేసిన కార్యనిర్వాహక ఉత్తర్వులను సవాల్ చేస్తూ కోర్టుల్లో నాలుగు దావాలు దాఖలయ్యాయి. డెమాక్రటిక్ పార్టీ ఎక్కువ స్థానాలు గెలిచిన 22 రాష్ర్టాలతో పాటు కొలంబియా జిల్లా, శాన్ ఫ్రాన్సిస్కో నగరం ట్రంప్ నిర్ణయాన్ని బోస్టన్, సియాటిల్ కోర్టుల్లో సవాల్ చేశాయి.
ట్రంప్ తన అధికార పరిధిని దాటారని, అమెరికా రాజ్యాంగాన్ని ఉల్లంఘించారని దావాల్లో పేర్కొన్నాయి. అమెరికన్ సివిల్ లిబర్టీస్ యూనియన్‌తో పాటు పలు వలసదారుల సంఘాలు సైతం ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌కు వ్యతిరేకంగా కోర్టులను ఆశ్రయించాయి. ట్రంప్ నిర్ణయం అమలైతే అమెరికాలో ఏటా 1.50 లక్షల మంది పిల్లలకు పౌరసత్వాన్ని తిరస్కరించాల్సి వస్తుందని మసాచుసెట్స్ అటార్నీ జనరల్ అండ్రియా జాయ్ క్యాంప్‌బెల్ తెలిపారు. రాజ్యాంగ హక్కులను లాక్కునే అధికారం ట్రంప్‌నకు లేదని ఆమె ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
రాజ్యాంగ సవరణతోనే సాధ్యమా?
ట్రంప్ జారీ చేసిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌తో జన్మతః పౌరసత్వం రద్దు కుదరదని పలువురు న్యాయ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ‘ట్రంప్ చాలామంది ప్రజలను అసంతృప్తికి గురిచేసే చర్యకు దిగుతున్నారు. అంతిమంగా ఈ విషయాన్ని కోర్టులు నిర్ణయిస్తాయి. ట్రంప్ సొంతంగా తీసుకునే నిర్ణయం కాదిది’ అని అమెరికా రాజ్యాంగ నిపుణుడు, యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా లా స్కూల్ ప్రొఫెసర్ సాయికృష్ణ ప్రకాశ్ అభిప్రాయపడ్డారు.
ట్రంప్ ఉత్తర్వులను పాటించి అధికారులు పౌరసత్వాన్ని తిరస్కరిస్తే, వారు కోర్టును ఆశ్రయించవచ్చని, చివరకు సుప్రీంకోర్టు వరకు ఈ విషయం వెళ్లొచ్చని పలువురు నిపుణులు చెప్తున్నారు. జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేయాలంటే రాజ్యాంగ సవరణ చేయాల్సి ఉంటుందని, ఇందుకు ప్రతినిధుల సభ, సెనేట్‌లో మూడింట రెండొంతుల సభ్యుల ఆమోదం, నాలుగింట మూడో వంతు రాష్ర్టాల ఆమోదం అవసరమని చెప్తున్నారు. ప్రస్తుతం రిపబ్లికన్ పార్టీకి ఉభయ సభల్లో ఉన్న మెజారిటీతో ఇది సాధ్యం కాదని అభిప్రాయపడుతున్నారు.
వ్యతిరేకిస్తున్న భారత-అమెరికన్ చట్టసభ్యులు
జన్మతః పౌరసత్వాన్ని రద్దు చేస్తూ ట్రంప్ ఇచ్చిన కార్యనిర్వాహక ఉత్తర్వును అమెరికాలోని భారత సంతతి చట్టసభ్యులు వ్యతిరేకిస్తున్నారు. ఈ నిర్ణయం కేవలం అక్రమ వలసదారులపైనే కాకుండా భారత్ నుంచి హెచ్1బీ వీసాలపై వచ్చిన విద్యార్థులు, నిపుణులపైనా ప్రభావం చూపుతుందని ఇండియన్-అమెరికన్ చట్టసభ్యుడు రో ఖన్నా పేర్కొన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఏం చెప్పారనేది, ఏం చేశారనేది విషయం కాదని, జన్మతః పౌరసత్వం కొనసాగుతుందని, ఇందుకోసం తాను పోరాడతానని మరో సభ్యుడు శ్రీ థానేదార్ పేర్కొన్నారు. ట్రంప్ నిర్ణయం రాజ్యాంగ విరుద్ధమని, ఒక్క పెన్నుపోటుతో తీసుకోవాల్సినది కాదని మరో సభ్యురాలు ప్రమీలా జయపాల్ ఆరోపించారు.
పాఠశాలల్లో ఉన్నా అరెస్టు చేయొచ్చు
అక్రమ వలసదారులపై ట్రంప్ మరో కఠిన నిర్ణయం తీసుకున్నారు. ఇంతవరకు పాఠశాలలు, చర్చ్‌లు వంటి సున్నితమైన ప్రదేశాల్లో అక్రమ వలసదారులను అరెస్టు చేయడానికి అవకాశం ఉండేది కాదు. ఈ ఆంక్షలను ట్రంప్ యంత్రాంగం తొలగించింది. ఇమ్మిగ్రేషన్ చట్టాలను అమలు చేసే అధికారులు ఎక్కడైనా చర్యలు తీసుకోవచ్చని, ఇక నుంచి నేరస్థులు అరెస్టును తప్పించుకునేందుకు పాఠశాలలు, చర్చ్‌లలో దాక్కోలేరని మంగళవారం అమెరికా డిపార్ట్మెంట్ ఆఫ్ హోంల్యాండ్ సెక్యూరిటీ ప్రకటించింది. ఈ నిర్ణయంతో అక్రమ వలసదారులు వారి పిల్లలను పాఠశాలలకు పంపించేందుకు కూడా భయపడుతున్నారు.
చైనాపై 10 శాతం సుంకం?
ఫిబ్రవరి 1 నుంచి చైనా నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే వస్తువులపై 10 శాతం సుంకం విధించాలని భావిస్తున్నట్టు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. కాగా, రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను ఉద్దేశించి ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్‌తో రష్యా యుద్ధాన్ని ముగించేందుకు తాను పుతిన్‌ను కలవడానికి సిద్ధంగా ఉన్నానని, చర్చలకు పుతిన్ ముందుకు రాకపోతే రష్యాపై మరిన్ని ఆంక్షలు విధించవచ్చని ట్రంప్ హెచ్చరించారు.
సమర్థులు అమెరికా రావడం ఇష్టమే: ట్రంప్
ఇతర దేశాలకు చెందిన నిపుణులు అమెరికాలో ఉద్యోగం చేసేందుకు వీలు కల్పించే హెచ్1బీ వీసాపై జరుగుతున్న చర్చలో రెండు వైపులా వాదనలు నచ్చాయని ట్రంప్ ప్రకటించారు. సమర్థులైన వారు తమ దేశానికి రావడం తనకూ ఇష్టమేనని చెప్పారు. ఒరాకిల్, సాఫ్ట్‌బ్యాంక్, ఓపెన్ఏఐ సంస్థల అధినేతలతో కలిసి మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కృత్రిమ మేధ(ఏఐ)ను ప్రోత్సహించేందుకు ఒరాకిల్, సాఫ్ట్‌బ్యాంక్, ఓపెన్ఏఐ సంస్థల భాగస్వామ్యంతో ఒక కొత్త సంస్థను స్థాపించి, దాని ద్వారా 500 బిలియన్ డాలర్లు ఖర్చు చేయనున్నట్టు తెలిపారు.
Read Today's Latest International News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
harish rao | చెడుపై మంచి, అధర్మంపై ధర్మం సాధించిన విజయానికి ప్రతీక విజయదశమి : హరీశ్ రావు
Donald Trump | ఇరాన్ 75 వేల మంది నిరసనకారులను చంపేసింది.. డొనాల్డ్ ట్రంప్ సంచలన ఆరోపణ..!
Singer Daler Mehndi | మాట్లాడటమే రావడం లేదు, ఇక పాటలు ఎలా పాడతారు?.. సింగర్ దాలెర్ మెహందీని నిలదీసిన మంత్రి!
Car Accident | ఉప్పల్ లో కారు బీభత్సం.. పైప్‌లైన్ పగిలి ఎగిసిపడిన నీళ్లు.. వీడియో
Parvesh Verma | యయునా నది వెంట బర్త్‌డే వేడుకలు జరుపుకోండి : ఢిల్లీ మంత్రి
ట్రెండింగ్ వార్తలు
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!

