వాషింగ్టన్: జన్మతః వచ్చే పౌరసత్వాన్ని(Birthright Citizenship) రద్దు చేస్తూ అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆదేశాలు జారీ చేశారు. దీని వల్ల అక్రమ వలసదారులతో పాటు విద్యార్థులు, ప్రొఫెషనల్స్‌కు ఆటంకాలు ఎదురుకానున్నాయి. వలసదారులకు పుట్టే పిల్లలకు జన్మతః పౌరసత్వం రాదు అని ట్రంప్ తాజా ఆదేశాల్లో పేర్కొన్నారు. ఆ ఆదేశాలను భారతీయ సంతతి రాజకీయవేత్తలు తప్పుపట్టారు. అమెరికా చట్టసభప్రతినిధి రో ఖన్నా మాట్లాడుతూ.. బర్త్‌రైట్ సిటిజన్‌షిప్ రద్దు వల్ల హెచ్1బీ వీసాలపై ఉంటున్న వారి పిల్లలకు కూడా ప్రభావం పడుతుందన్నారు. హెచ్1బీ వీసాలపై అమెరికాలో పనిచేసే భారత్, చైనీయులు ఎక్కువ సంఖ్యలో ఉంటారు. అయితే చట్టపరంగా వలసవచ్చినవారితో పాటు తాత్కాలికంగా స్టూడెంట్ వీసాలపై ఉన్న వారికి కూడా బర్త్‌రైట్ సిటిషన్షిప్ రద్దుతో ఇబ్బందులు ఎదురవుతాయని రో ఖన్నా తెలిపారు.
ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు ఎలా ఉన్నా.. జన్మతః పౌరసత్వం హక్కు కోసం పోరాటం చేస్తానని, ఎన్ని అవరోధాలు ఎదురైనా, ఆ చట్టం కోసం ఫైట్ చేస్తానని మరో భారత సంతతి ప్రతినిధి శ్రీ థానేధార్ తెలిపారు. జన్మతః పౌరసత్వంపై ట్రంప్ ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగ వ్యతిరేకమని ప్రమీలా జయపాల్ తెలిపారు. ఇది రాజ్యాంగ వ్యతిరేకం అని, కేవలం ఓ పెన్ను సంతకంతో దాన్ని రద్దు చేయలేమని, ఒకవేళ ఆ చట్టాన్ని ఆమోదిస్తే, అప్పుడు రాజ్యాంగాన్ని అవమానించినట్లు అవుతుందన్నారు. ఇమ్మిగ్రేషన్ రైట్స్ గ్రూపులు.. ట్రంప్ ఆదేశాలకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేసినట్లు ప్రమీలా తెలిపారు.
జన్మతః పౌరసత్వ రద్దు ఆదేశాల ప్రకారం.. ఒకవేళ పేరెంట్స్ అమెరికా పౌరులు లేదా పర్మనెంట్ రెసిడెంట్ కాకుంటే, అప్పుడు 2025, ఫిబ్రవరి 19వ తేదీ తర్వాత పుట్టే పిల్లలకు ఆటోమెటిక్‌గా పౌరసత్వాన్ని ఇవ్వబోమని పేర్కొన్నారు. ట్రంప్ ఆదేశాలను సవాల్ చేస్తూ 22 రాష్ట్రాల్లో అటార్నీ జనరల్స్ కేసులు దాఖలు చేశారు. 14వ సవరణ ప్రకారం అమెరికాలో జన్మించే పిల్లలకు ఆటోమెటిక్‌గా పౌరసత్వం వస్తుంది. అయితే 18 రాష్ట్రాలు, రెండు నగరాలు ఆ సవరణను ప్రస్తావిస్తూ కోర్టులో కేసు వేశాయి.