India Passport | 2025 సంవత్సరానికి గానూ ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్‌పోర్ట్ కలిగి ఉన్న దేశాల జాబితాను (most powerful passports ranking) హెన్లీ పాస్‌పోర్ట్ ఇండెక్స్ (Henley Passport Index) అనే సంస్థ విడుదల చేసింది. ఇందులో భారత్ (India Passport) ర్యాంకు గతేడాది కంటే ఐదు స్థానాలు దిగజారడం గమనార్హం (India Passport).
గతేడాది ఈ జాబితాలో 80వ స్థానంలో ఉన్న ఇండియా.. తాజాగా 85వ స్థానానికి పడిపోయింది. గతేడాది మన దేశ పాస్‌పోర్ట్ ఉన్న వారు 62 దేశాల్లో వీసా లేకుండానే పర్యటించే అవకాశం ఉండేది. అది ఇప్పుడు కేవలం 57 దేశాలకు మాత్రమే వీసా లేకుండా ప్రయాణించే వీలు ఉంది. దీంతో ర్యాంకింగ్ కూడా పడిపోయింది.
ఇక ఈ జాబితాలో సింగపూర్ (Singapore) మరోసారి అగ్రస్థానంలో నిలిచింది. సింగపూర్ పాస్‌పోర్ట్‌తో 193 దేశాలకు వీసా లేకుండా వెళ్లవచ్చు. ఆ తర్వాతి స్థానాల్లో దక్షిణ కొరియా (190), జపాన్ (189) ఉన్నాయి. జర్మనీ, ఇటలీ, లక్సెంబర్గ్, స్పెయిన్, స్విట్జర్లాండ్ దేశాలు సంయుక్తంగా నాలుగో స్థానంలో నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 188 దేశాలకు వీసా లేకుండానే ప్రయాణించొచ్చు. ఇక ఐదో స్థానంలో ఆస్ట్రియా, బెల్జియం, డెన్మార్క్, ఫిన్లాండ్, ఫ్రాన్స్, ఐర్ల్యాండ్ దేశాల నిలిచాయి. ఈ దేశాల పాస్‌పోర్టులతో 187 దేశాలకు వీసా లేకుండా వెళ్లొచ్చు.
హంగరీ, న్యూజిలాండ్, నార్వే, పోర్చుగల్, స్వీడెన్ దేశాలు ఆరో స్థానంలో, ఆస్ట్రేలియా, జెక్ రిపబ్లిక్, మాల్టా, పోలాండ్ దేశాలు 7వ స్థానంలో, క్రొయేషియా, ఎస్టోనియా, స్లోవేకియా, స్లొవేనియా, యూఏఈ, యూకే దేశాలు ఎనిమిదో స్థానంలో నిలిచాయి. తొమ్మిదో స్థానంలో కెనడా, పదో స్థానంలో లాట్వీయా, లీసెస్టైన్ దేశాలు ఉన్నాయి. భారత్ పొరుగు దేశాల విషయానికొస్తే.. దాయాది పాకిస్థాన్ 103వ స్థానంలో, బంగ్లాదేశ్ 100, నేపాల్ 101, శ్రీలంక 98వ స్థానంలో ఉన్నాయి. భూటాన్ 92వ ర్యాంకుతో భారత్ కంటే వెనుకంజలో ఉంది.
ఈ ర్యాంకింగ్స్‌లో అగ్రరాజ్యం అమెరికాకు షాక్ తగిలింది. ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన పాస్‌పోర్ట్‌ల జాబితా నుంచి పడిపోయింది. 20 సంవత్సరాల తర్వాత తొలిసారిగా యూఎస్ పాస్‌పోర్ట్ టాప్-10 నుంచి దిగజారింది. తాజా ర్యాంకింగ్స్‌లో అమెరికా 12వ స్థానానికి పడిపోయింది. ప్రస్తుతం, మలేషియాతో కలిసి యూఎస్ 12వ స్థానంలో నిలిచింది. అమెరికా పాస్‌పోర్ట్ హోల్డర్లు ఇప్పుడు కేవలం 180 దేశాలకు మాత్రమే వీసా లేకుండా ప్రయాణం చేసే అవకాశం ఉంటుంది. చైనా ఈ విషయంలో ముందుకు దూసుకెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గత పదేళ్లల్లో చైనా 30 స్థానాల మేర ఎగబాకింది. చైనా తన పాస్‌పోర్ట్ ర్యాంకును 94 నుంచి 64కు మెరుగుపరచుకుంది. చైనా ఇప్పుడు 76 దేశాల పౌరులకు వీసా రహిత ప్రవేశం కల్పిస్తూ, ఓపెన్నెస్ ఇండెక్స్‌లో 64వ స్థానంలో నిలిచి.. అమెరికాను అధిగమించింది.
Also Read..
మల్లోజుల బాటలో ఆశన్న!.. వనం వీడుతున్న మావోయిస్టు పార్టీ అగ్రనేతలు
అమెజాన్‌లో మళ్లీ లేఆఫ్‌లు.. హెచ్ఆర్లో15 శాతం మందిపై వేటు
రోడ్లు సరిగా లేకుంటే పన్ను చెల్లించం.. కాంగ్రెస్ సర్కారుకు బెంగళూరు ప్రజల హెచ్చరిక