కొత్తగూడెం ప్రగతి మైదాన్/సుబేదారి, అక్టోబర్ 15: మావోయిస్టు పార్టీ అగ్రనేతలు ఒకరి తర్వాత ఒకరు వనం వీడి జనజీవన స్రవంతిలో కలుస్తున్నారు. మావోయిస్టు పార్టీ దళాలపై కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన యుద్ధంతో ఎవరి దారి వారు చూసుకుంటున్నారు. దీనికితోడు ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు మృతితో ఆ పార్టీ కకావికలమవుతున్నది. ఆయన స్థానాన్ని తిప్పిరి తిరుపతితో భర్తీ చేసిన నాటి నుంచి మావోయిస్టు పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలోనే పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు మల్లోజుల వేణుగోపాల్ రావు.. పార్టీకి చెందిన 60 మంది ముఖ్య సభ్యులు, కార్యకర్తలతో కలిసి లొంగిపోవడం వల్ల ఆ పార్టీకి పెద్ద నష్టమే వాటిల్లిందని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలోనే మల్లోజుల బాటలో మరో కీలక సభ్యుడు, మోస్ట్ వాంటెడ్ తక్కళ్లపల్లి వాసుదేవరావు అలియాస్ ఆశన్న అలియాస్ రూపేష్ సైతం లొంగు‘బాట’ పడుతున్నట్లు సమాచారం. ఇప్పటికే మావోయిస్టు పార్టీలో దాదాపు కేంద్ర, రాష్ట్ర కమిటీలు తుడిచి పెట్టుకుపోయినైట్లెంది. ఆశన్న లొంగిపోతే ఆ పార్టీకి మరో భారీ షాక్ తగిలినట్టే.
ములుగు జిల్లా వెంకటాపురం మండలం లక్ష్మీదేవిపేట గ్రామం పోలోనిపల్లికి చెందిన వాసుదేవరావు సుమారు 40 ఏళ్ల ఉద్యమ ప్రస్థానానికి స్వస్తి పలికేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. వాసుదేవరావు ప్రస్తుతం మావోయిస్టు పార్టీ దండకారణ్యం స్పెషల్ జోనల్ కమిటీ(డీకేఎస్జడ్సీఎం), స్టేట్ మిలటరీ కమిషన్(ఎస్ఎంసీ), నార్త్ సబ్ జోనల్ బ్యూరో(ఎన్ఎస్జడ్బీ) కార్యవర్గ సభ్యుడిగా వ్యవహరిస్తున్నారు. ఆశన్న భార్య శ్రీవిద్య అలియాస్ శ్రీదేవి(సీనియర్ పార్టీ సభ్యురాలు)ని ఈ ఏడాది జూలైలో హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసిన విషయం విదితమే. ఆశన్నపై రూ.20 లక్షలపైనే రివార్డు ఉంది.
ఛత్తీస్గఢ్ రాష్ట్రం కాంకేర్ జిల్లాలో 50 మంది మావోయిస్టులు, సుక్మా జిల్లాలో27 మంది మావోయిస్టులు బుధవారం పోలీసుల ఎదుట లొంగిపోయారు.