బెంగళూరు, అక్టోబర్ 15: ఇవేం రోడ్లు, ఇవేం డ్రైనేజీల నిర్మాణం? ఒక ప్రణాళిక, పద్ధతి లేదా?, నిర్మాణంలో శాస్త్రీయ విధానాలు పాటించరా? అంటూ బెంగళూరు తూర్పు ప్రాంత వాసులు కర్ణాటకలోని కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చిన్నపాటి వర్షానికే ముంచుతున్న వరదలు, అస్తవ్యస్తంగా ఉన్న రోడ్డు సంబంధిత పనులు, ప్రణాళిక లేని పౌర ప్రాజెక్టులపై వారు మండిపడ్డారు. తమకు ప్రాథమిక మౌలిక సదుపాయాలను పునరుద్ధరించే వరకు ఆస్తి పన్ను వసూళ్లను నిలిపివేయాలని ముఖ్యమంత్రిని డిమాండ్ చేశారు.
ఆదాయపు పన్ను చెల్లింపుదారుకు ప్రాతినిధ్యం వహిస్తున్న పౌరుల సమూహమైన పానత్తూరు, వర్తూర్, బలగెరెకు చెందిన ఇండివిడ్యువల్ ట్యాక్స్ పేయర్స్ ఫోరమ్ (ఐటీపీఎఫ్) సభ్యులు ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు లేఖ రాశారు. పౌర సంస్థలు అశాస్త్రీయంగా, అసంపూర్ణంగా , సమన్వయం లేకుండా వైట్ టాపింగ్, డ్రైనేజీ పనులను నిర్వహిస్తున్నాయని ఆరోపించారు. దీవివల్ల తీవ్ర వరదలు సంభవించాయని, ట్రాఫిక్, సాధారణ జీవితానికి అంతరాయం కలిగిందని వారు తెలిపారు. దీనిపై పలు సార్లు విజ్ఞప్తి చేశామని, సాక్షాత్తూ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య సెప్టెంబర్ 27న వరదల్లో చిక్కుకున్న వర్తూర్ ప్రాంతాన్ని సందర్శించినా పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదని, అధికారులు పైపై ప్యాచ్ వర్క్‌లతో సరిపెట్టారని మండిపడ్డారు.
డ్రైనేజీ లైన్లను మురికి నీటి మ్యాన్‌హోల్స్‌కు అనుసంధానించారని, దీంతో భారీ వర్షాల సమయంలో దాని ద్వారా భారీగా మురికినీరు వెనక్కి తన్నుతున్నదని చెప్పారు. గ్రేడియంట్ డిజైన్ లోపభూయిష్టంగా ఉండటం వల్ల కొత్తగా పునరుద్ధరించిన ప్రాంతాలు, ముఖ్యంగా పానత్తూరు ప్రధాన రోడ్డులో వరదలు వచ్చాయని వాపోయారు. ప్రస్తుతం జరుగుతున్న అన్ని అభివృద్ది పనులపై శాస్త్రీయ ఆడిట్ నిర్వహించాలని, అవకతకవలకు పాల్పడిన కాంట్రాక్టర్లు, అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా సురక్షితమైన ఫుట్‌పాత్‌లు నిర్మించాలని, సహజ డ్రైనేజీ చానల్స్‌ను మూసివేసి ఆక్రమణలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. ‘నమ్మ బెంగళూరు ప్రపంచ వ్యాప్తంగా భారత దేశ ఐటీ హబ్‌గా ప్రసిద్ధి చెందింది. కానీ అలాంటి పౌర నిర్లక్ష్యం బ్రాండ్ బెంగళూరు గౌరవం, విశ్వసనీయతను దెబ్బతీస్తుందని’ వారు అన్నారు.
పన్నుల చెల్లింపునకు పౌరులు ఎంతమాత్రం వ్యతిరేకం కాదని, కానీ వారు దానికి తగ్గ మేలైన సౌకర్యాలు కోరుకుంటారన్నారు. ‘మాకు మంచి మౌలిక సౌకర్యాలు కల్పించండి.. పన్ను వసూలు చేసుకోండి. జీబీఏ ఇదే విధంగా పన్ను దారుల విజ్ఞప్తిని నిర్లక్ష్యం చేస్తే, మా దగ్గరి నుంచి పన్ను వసూలు చేయవద్దని ఆదేశించమని మేము మిమ్మల్ని కోరుతాం’ అని వారు సీఎంకు రాసిన లేఖలో పేర్కొన్నారు. పన్ను వసూలు నుంచి ప్రభుత్వం కనుక మినహాయిస్తే తాము ఆ సొమ్ముతో సొంతంగానే మౌలిక సౌకర్యాలు మెరుగుపరుస్తామని, ప్రభుత్వంపై ఎంతమాత్రం ఆధారపడమని ఫోరమ్ సభ్యులు పేర్కొన్నారు. కాగా ఫోరమ్ సభ్యులు చేసిన ఆరోపణలు ఇంజనీర్లు తిరస్కరిస్తూ రోడ్ వర్క్స్ మాన్యువల్ ప్రకారం అంతా శాస్త్రీయంగానే పనులు చేపట్టామని తెలిపారు.
బెంగళూరులో గుంతలు పడ్డ రోడ్ల మరమ్మతు పనులు వేగంగా జరుగుతున్నాయని, శిథిలావస్థకు చేరిన రోడ్లపై తీవ్ర చర్చలు జరుగుతున్న క్రమంలో ఆస్తి పన్ను చెల్లింపును నిలిపివేస్తామని పౌరుల బృందం బెదిరించినప్పటికీ ఈ పనులు చకచకా జరుగుతున్నాయని డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ చెప్పారు. ఈ మేరకు బుధవారం ఆయన ఎక్స్‌లో పోస్ట్ పెడుతూ బెంగళూరు నగరంలో ట్రాఫిక్ సాఫీగా సాగేందుకు ప్రాధాన్యత ఇస్తూ వివిధ ప్రదేశాలలో తారు రోడ్లు వేస్తుండటమే కాక, గోతులు పూడ్చే పనిని యుద్ధప్రాతిపదికన చేస్తున్నట్టు చెప్పారు.