ఇస్లామాబాద్: జైషే మహ్మద్ చీఫ్ మసూద్ అజర్ ఆచూకీ తెలిపిన వారికి ఇచ్చే నజరానాను పాక్ ప్రభుత్వం రూ.24 లక్షలకు పెంచింది. అజర్ 2021లో అప్ఘనిస్థాన్‌కు పారిపోయాడని తన కొత్త రెడ్ బుక్‌లో పాక్ ఫెడరల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ తెలిపింది. ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్(ఎఫ్ఏటీఎఫ్) అక్టోబర్‌లో సమావేశం కానున్న నేపథ్యంలో పాక్ ఈ చర్యలు తీసుకున్నది. పాక్ నజరానా పెంపుపై భారత్ స్పందిస్తూ.. ఇలాంటి మోసపు ప్రకటనలను ఆ దేశం గతంలో కూడా చేసిందని విమర్శించింది. గతంలో ఎఫ్ఏటీఎఫ్ పాకిస్థాన్‌ను గ్రే లిస్ట్‌లో ఉంచింది.
ఉగ్రవాదానికి ఆర్థిక సాయంపై, మనీ లాండరింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఆ సమయంలో పాక్‌పై ఒత్తిడి తెచ్చింది. మళ్లీ ఇప్పుడు అలాంటి ఒత్తిడి ఎదురయ్యే అవకాశం ఉన్న నేపథ్యంలో పాక్ అజర్‌పై ఉన్న నజరానాను పెంచింది. 2016 పఠాన్ కోట్, 2019లో పుల్వామా దాడుల్లో అజర్ నిందితుడిగా ఉన్నాడు.