Joe Biden | మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ (Manmohan Singh) మృతి పట్ల అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (Joe Biden) సంతాపం వ్యక్తం చేశారు. ఆయన ‘నిజమైన రాజనీతిజ్ఞుడు’, ‘గొప్ప ప్రజా సేవకుడు’ అంటూ కొనియాడారు. ‘మన్మోహన్ సింగ్ ఓ గొప్ప రాజనీతిజ్ఞుడు. అద్భుతమైన ప్రజా సేవకుడు. ఆయన వ్యూహాత్మక దృక్పథం లేకుంటే భారత్ – అమెరికా మధ్య అపూర్వమైన సహకారం సాధ్యమయ్యేదే కాదు. చారిత్రాత్మకమైన భారతదేశం-అమెరికా పౌర అణు ఒప్పందం (US – India Civil Nuclear Deal ) నుంచి ఇండో – పసిఫిక్ భాగస్వాముల కోసం క్వాడ్‌ను ప్రారంభించడం వరకూ ఆయన కృషి మరవలేనిది’ అంటూ పేర్కొన్నారు. జో బైడెన్, జిల్ బైడెన్.. మన్మోహన్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు వైట్‌హౌస్ ఓ ప్రకటన విడుదల చేసింది.
2004 నుంచి 2014 వరకు భారత ప్రధానిగా సేవలందించిన మన్మోహన్ సింగ్ మొదటి పర్యాయంలోనే దేశంలో ఎన్నో సంస్కరణలను తీసుకొచ్చారు. పైకి మృదుస్వభావిలా కనిపించినా దేశం కోసం తీసుకునే నిర్ణయాల్లో అత్యంత కఠినంగా వ్యవహరించారు. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పాటు, ఉపాధి హామీ పథకం ప్రారంభం వంటి ఎన్నో కీలక పరిణామాలు ఆయన ప్రధానిగా ఉన్నప్పుడే చోటుచేసుకున్నాయి. 2008లో చారిత్రాత్మకమైన భారతదేశం-అమెరికా పౌర అణు ఒప్పందంపై సంతకం చేశారు. భారతదేశం ప్రపంచ అణు మార్కెట్లోకి ప్రవేశించడానికి, ఇంధన సంక్షోభాన్ని అధిగమించడానికి ఈ ఒప్పందం దోహదపడింది. యూపీఏ ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతిచ్చిన లెఫ్ట్ పార్టీలు ఈ ఒప్పందాన్ని తీవ్రంగా వ్యతిరేకించాయి. మద్దతు ఉపసంహరించుకున్నాయి. అయినా మన్మోహన్ సింగ్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అవసరమైతే ప్రధాని పదవికి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమయ్యారు.
Also Read..
Manmohan Singh | మన్మోహితమే.. శోకసంద్రంలో భారతావని!
Manmohan Singh | నిగమ్‌బోధ్ ఘాట్‌లో మాజీ ప్రధాని మన్మోహన్ అంత్యక్రియలు..!
Union Cabinet | మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతికి కేంద్ర క్యాబినెట్ సంతాపం
Manmohan Singh | బంగారాన్ని తాకట్టు పెట్టి.. దేశ దిశను మార్చేసిన మన్మోహన్ సింగ్